Begin typing your search above and press return to search.

టాటాలకు మిస్త్రీ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ఏమిటి?

By:  Tupaki Desk   |   28 Sep 2020 2:30 AM GMT
టాటాలకు మిస్త్రీ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ఏమిటి?
X
టాటా.. మిస్త్రీ ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి? అని అడిగితే.. చాలామంది చప్పున కార్పొరేట్ రిలేషన్ అంటారు. కానీ.. ఆ రెండు కుటుంబాల గురించి బాగా తెలిసిన వారు మాత్రం.. వారిది వ్యాపార సంబంధానికి ముందే.. రెండు కుటుంబాల మధ్య చక్కటి బంధం ఉందని చెబుతారు. ఈ రెండు పార్శీ కుటుంబాల మధ్యనున్న 70 ఏళ్ల అనుబంధానికి త్వరలో చెల్లుచీటి పడనుంది. ఈ రెండు కుటుంబాల మధ్య బ్రేకప్ కు కారణం ఏమిటన్న విషయం పై చాలానే వార్తలు వచ్చాయి.

ఇంతకీ ఈ రెండు ఫ్యామిలీలు ఎందుకంత దగ్గర అయ్యాయి? వారి బంధం ఎలా మొదలైంది? అన్న విషయాల్లోకి వెళితే.. చాలా విషయాల మీద క్లారిటీ రాక మానదు. రతన్ టాటా ఉన్నారు కదా. ఆయన సోదరుడు పేరు నోవల్ టాటా. ఆయనకు సైరన్ మిస్త్రీ సోదరి కమ్ పల్లోంజీ మిస్త్రీ కుమార్తె అయిన ఆలూ మిస్త్రీని ఇచ్చి పెళ్లి చేశారు. అంటే.. టాటా సోదరుడికి పల్లోంజీ మిస్త్రీ స్వయంగా పిల్లను ఇచ్చి మామ అన్న మాట. అలా రెండు వ్యాపార కుటుంబాల మధ్య మొదలైన వ్యక్తిగత సంబంధం తర్వాతి రోజుల్లో కార్పొరేట్ బంధంగా రూపాంతం చెందింది.

తమ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధంతో టాటా గ్రూపులో మిస్త్రీ ఫ్యామిలీ కోటిరూపాయిలు పెట్టి కొంత వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరికొన్నికొనుగోళ్లు కూడా జరిగాయి. అవన్నీ కలిపి ఇప్పుడు టాటా గ్రూపులో వాటా 18 శాతంగా మారింది. దాని విలుల ఇప్పుడు ఏకంగా 20 బిలియన్ డాలర్లకు పైనే. గడిచిన కొంతకాలంగా టాటాలకు.. మిస్త్రీలకు మధ్య పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. టాటాలో తమ వాటాను అమ్మాలని భావిస్తున్నారు. అదే సమయంలో.. పల్లోంజీల వాటాను వేరే వారెవరికి అమ్మకుండా తామే సొంతం చేసుకోవాలని టాటాలు భావిస్తున్నారు.

మరిప్పుడు పల్లోంజీలకు చెల్లించాల్సిన 20 బిలియన్ డాలర్లను టాటాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నది పెద్ద ప్రశ్న. చూస్తుంటే.. టీసీఎస్ లో తమకున్న వాటాను తగ్గించుకోవటంతో పాటు.. నమోదిక కంపెనీల్లో షేర్లను తనఖా పెట్టటం ద్వారా మిస్త్రీల వాటాల్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. 20 బిలియన్ డాలర్లు అంటే.. దగ్గర దగ్గర రూ.1.5లక్షల కోట్లు. ఇంత భారీ మొత్తాన్ని సమీకరించాలంటే టీసీఎస్ లో 16 శాతం వాటాను అమ్ముకోవాల్సి ఉంటుంది.

అదే జరిగితే గ్రూప్ షేర్ హోల్డింగ్ లో ఇప్పటివరకు ఉన్న 72 శాతం వాటా నుంచి 56 శాతానికి తగ్గుతుంది. అదే జరిగితే మెజార్టీ యాజమాన్య వాటా టాటాల చేతిలోనే ఉన్నా.. కంపెనీ నుంచి వచ్చే నగదు తగ్గుతుందన్నది మర్చిపోకూడదు. టాటా గ్రూపునకు టీసీఎస్ వెన్నుముకలా ఉంటుందన్నది మర్చిపోకూడదు. టీసీఎస్ లో పదహారు శాతం వాటాను అమ్మేస్తే.. టాటాలకు నగదు విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుందన్నది మర్చిపోకూడదు. భారీ మొత్తాన్ని సమీకరించుకోవటానికి టాటాలకు ఉన్న మార్గాలన్ని కూడా ఏవో ఒక తలనొప్పులు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో మిస్త్రీ ఫ్యామిలీ వాటాను సొంతం చేసుకోవటం కోసం టాటాలు పెద్ద పరీక్షనే ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు.