Begin typing your search above and press return to search.

భర్తపై మరిగే నూనె పోసి పారిపోయిన భార్య ..కారణం ఏంటి ?

By:  Tupaki Desk   |   10 Feb 2021 10:06 AM GMT
భర్తపై మరిగే నూనె పోసి పారిపోయిన భార్య ..కారణం ఏంటి ?
X
హైదరాబాద్ మహానగర శివారులో ఓ దారుణ సంఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల కారణంగా భర్త పై మరుగుతున్న నూనెను పోసేసింది. కాలుతున్న వేడి నూనె, కారాన్ని భర్త పై చల్లిన భార్య తన కూతురి తో సహా పారిపోయింది. నూనె వేడికి బొబ్బలు రావడం, చర్మం ఊడటం, అలా చర్మం ఊడిన శరీరంపై కారం పడటంతో అతడి బాధ వర్ణనాతీతం. ఒళ్లు గగుర్పుడిచే ఈ ఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే .. హుస్నాబాద్ కు చెందిన 44 ఏళ్ల సదయ్య, రజిత దంపతులు కుమార్తెతో కలిసి జగద్గిరిగుట్ట పరిధిలోని దీనబంధు కాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా సదయ్యకు మతిస్థిమితం లేకపోవడం వల్ల ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇటీవలే మళ్లీ కాస్త మమూలు మనిషిలా మారాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుండటంతో రజిత తన కుమార్తెతో కలిసి తరచు పుట్టింటికి వెళ్లేది.

ఈ క్రమంలోనే కొన్నాళ్ల క్రితం మళ్లీ తన భర్త వద్దకు వచ్చింది. సదయ్య జీవనోపాధి కోసం కూరగాయలు అమ్ముతూ ఉంటుంటారు. మంగళవారం సాయంత్రం కూడా అలా కూరగాయలు అమ్మేందుకు వెళ్లి రాత్రి పొద్దుపోయాక ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే ఇంట్లో భార్య, కూతురు ఉన్నారు. ఇంటి ప్రహరీకి ఉన్న గేటుకు తాళం వేశారు. తాళం తీయమని ఎన్నిసార్లు భార్యా కుమార్తెకు చెప్పినా తీయలేదు. ఇంట్లోనే ఉండి కూడా ఏమాత్రం స్పందించలేదు.

దీంతో పక్కింటిలోకి వెళ్లి గోడ దూకి తన ఇంట్లోకి చేరుకున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదేంటని నిలదీసేలోపే భార్య సలసల మరుగుతున్న వేడి నూనెను అతడిపై పోసింది. ఆ తర్వాత అతడిపై కారం చల్లి కుమార్తెతో సహా అక్కడి నుంచి పరారయ్యింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాళి కట్టిన భర్త పై ఇంత అమానుషంగా ఎందుకు ఇలా ప్రవర్తించింది అని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.