Begin typing your search above and press return to search.

డీపీఆర్ లపై తెలుగు రాష్ట్రాల తర్జన భర్జనకు కారణమిదేనా?

By:  Tupaki Desk   |   18 Jan 2021 5:30 PM GMT
డీపీఆర్ లపై తెలుగు రాష్ట్రాల తర్జన భర్జనకు కారణమిదేనా?
X
నీళ్లు, నియామకాలు, నిధులు....ఈ విషయాల నేపథ్యంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ నీళ్ల విషయంలో మాత్రం ఇప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. ఇటు కృష్ణ, అటు గోదావరి నదులపై ఏపీ తెలంగాణ రాష్ట్రాలు పోటీపడి కొత్త ప్రాజెక్టులు కడుతున్నాయి. కానీ, ఈ వ్యవహారంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి నిబంధనలు పాటించటం లేదంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రానికి పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారానికి కేంద్రం తనదైన శైలిలో పరిష్కారం చూపింది. కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్ లు సమర్పించాలని ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్ లో అన్ని వివరాలు సమర్పించాలని 3 నెలల క్రితం కేంద్రం ఆదేశించింది.

కానీ, ఆంధ్రా ఇటు తెలంగాణ రాష్ట్రాలు డిపిఆర్ లను సమర్పించ లేదు. దీంతో కేంద్ర మంత్రి షెకావత్ తాజాగా ఏపీ ,తెలంగాణ రాష్ట్రాలకు డిపిఆర్ లపై మరో లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అయితే, డీపీఆర్ సమర్పించిన తర్వాత వాటికి అనుమతులు ఇవ్వకుండా కేంద్రం మోకాలడ్డుతుందేమోనన్న అనుమానాలు ఏపీ, తెలంగాణా వ్యక్తం చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుల కోసం బ్యాంకు లోన్ లు తీసుకున్నందున...ఇబ్బందులు ఏర్పడే అవకాశముందని తెలుగు రాష్ట్రాలు భయపడుతున్నాయట. ఇప్పటికే తెలంగాణా డీపీఆర్ సిద్ధం చేసి కూడా వేచి చూస్తోందట. ఇక, ఏపీ కూడా తెలంగాణా పంపిన తర్వాతే డిపిఆర్ పంపే యోచనలో ఉందట. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం నుంచి లేఖ వచ్చింది. మరి, ఈ లేఖకు ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.