Begin typing your search above and press return to search.

ఏమిటీ క్లౌడ్ బరస్ట్? ఎందుకు ఏర్పడతాయి? ఎక్కడ ఎక్కువగా ఉంటాయి?

By:  Tupaki Desk   |   18 July 2022 4:30 AM GMT
ఏమిటీ క్లౌడ్ బరస్ట్? ఎందుకు ఏర్పడతాయి? ఎక్కడ ఎక్కువగా ఉంటాయి?
X
ఎందుకు మాట్లాడారో తెలీదు? ఏమి ఆశించి చెప్పారో అర్థం కాని పరిస్థితి. జాతీయ రాజకీయాల మీద ఆసక్తి ఉండటం తప్పేం కాదు కానీ.. అంతర్జాతీయ కుట్రకు సంబంధించిన సమాచారం అన్నట్లుగా చెబుతూ.. వేరే దేశాల వారు తెలంగాణను టార్గెట్ చేశారన్నట్లుగా ఉన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. క్లౌడ్ బరస్ట్ ను కావాలనే చేస్తున్నారన్న మాట సీఎం కేసీఆర్ నోటి నుంచి రావటంతో.. అసలీ క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ఏర్పడుతుంది? ఎక్కడ ఏర్పడుతుంది? దీన్ని ముందస్తుగా గుర్తించే అవకాశం ఉందా? లాంటి ప్రశ్నలెన్నో మదిలో మెదులుతున్నాయి.

ఈ మధ్యనే అమర్ నాథ్ శివ లింగం సమీపంలో ఏర్పడినట్లుగా భావిస్తున్న క్లౌడ్ బరస్ట్ తో ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోవటం.. అప్పుడప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఏర్పడటం లాంటివి తెలిసిందే. ఇంతకీ ఈ ప్రక్రతి విపత్తు ఎందుకు ఏర్పడుతుంది? సాంకేతికంగా అడ్వాన్స్ గా ఉన్నామని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి విపత్తును ఎందుకు అంచనా వేయలేకపోతున్నాం? లాంటి ప్రశ్నలు తలెత్తే పరిస్థితి.

ఇంతకీ క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? అన్న ప్రాథమిక ప్రశ్నకు సమాధానం వెతికితే.. భారత వాతావరణ శాఖ చెప్పే దాని ప్రకారం.. స్వల్ప వ్యవధిలో భారీ వర్షాలు కురవటాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. మేఘాల విస్పోటనంగా అభివర్ణిస్తారు. 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కొన్ని సందర్భాల్లో ఉరుములు.. పిడుగులతో ఊహించని రీతిలో కురిసే ఈ భారీ వర్షాలతో వరదలు చోటు చేసుకుంటాయి.

అదే.. రెండు గంటల వ్యవధిలో ఐదు సెంటీమీటర్ల వర్ష పాతం నమోదు అయితే దాన్ని మినీ క్లౌడ్ బరస్ట్ గా పేర్కొంటారు. అలా అని.. స్వల్ప వ్యవధిలో కుమ్మరించేసినట్లుగా వర్షం పడే సందర్భాలన్ని క్లౌడ్ బరస్ట్ కాదనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకునే ప్రతి సందర్భంలోనే భారీగా ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పలేం. నగరాల్లో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంటే.. ప్రాణ నష్టానికి అవకాశం తక్కువ కానీ.. ఆస్తినష్టానికి అవకాశం ఉంటుంది.

అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది కదా? మరి.. ఈ క్లౌడ్ బరస్ట్ ను అంచనా వేయగలమా? అంటే.. అందుకు నో అని చెప్పేస్తారు శాస్త్రవేత్తలు. క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు.. ఎక్కడ చోటు చేసుకుంటుందన్నది అంచనా వేయటం కష్టమేనని చెబుతున్నారు. కాకుంటే.. క్లౌడ్ బరస్ట్ లు ఎక్కువగా ఎత్తైన ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయన్న మాట మాత్రం వినిపిస్తూ ఉంటుంది.

ఇంతకీ ఇవి ఎలా ఏర్పడతాయన్న ప్రశ్నకు సమాధానం చూస్తే.. ఇదంతా ఒక ప్రక్రియగా చెబుతుంటారు. రుతుపవనాలు దేశంలోని ప్రవేశించినప్పుడు ఆరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి.. ఇవి పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు అధిక తేమను కలిగి ఉంటాయి. వర్షం పడే స్థితి ఏర్పడినప్పటికి వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవించటం జరుగుతుంది. ఇలా ఘనీభవన ప్రక్రియ పలుసార్లు జరిగినప్పుడు మేఘాల సాంద్రత పెరుగుతుంది.
ఇలాంటి సమయంలో ఒక్కసారిగా విస్పోటనం చెందుతుంది. మరింతగా అర్థం కావాలంటే.. ఒక ట్యూబ్ లోకి గాలు అంతకంతకూ చేర్చినప్పుడు.. మోతాదుకు మించినప్పుడు ఏం జరుగుతుంది? టైరు పేలుతుంది.. గాలి బయటకు వచ్చేస్తుంది. అదే.. కిలోమీటర్ల వ్యవధిలో విస్తరించి ఉన్న మేఘాలు బాగా బరువెక్కినప్పుడు.. ఒక్కసారిగా విస్పోటనం చెందితే కుంభ వ్రష్టిలా వాన కురుస్తుంది. అదే.. క్లౌడ్ బరస్ట్ గా చెబుతారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం కురవటంతో వరద పోటెత్తే ప్రమాదం ఉంటుంది.

ఇంతకీ భారత్ లో ఇలాంటి క్లౌడ్ బరస్టులు ఎక్కువగా ఎక్కడ చోటు చేసుకుంటున్నాయి? అన్నది చూస్తే.. ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 1970 నుంచి ఇప్పటివరకు దాదాపు యాభై రెండేళ్లలో క్లౌడ్ బరస్ట్ లు దాదాపు 30 వరకు చోటు చేసుకున్నాయి. 2002లో ఉత్తరాంచల్ లో చోటు చేసుకున్న క్లౌడ్ బరస్ట్ కారణంగా 28 మంది బలైతే.. తాజాగా అమర్ నాథ్ గుహ వద్ద జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా 16 మంది మరణించారు. పలువురు గాయపడిన వైనం తెలిసిందే. మొత్తంగా చూస్తే.. క్లౌడ్ బరస్ట్ ను అంచనా వేయటానికే అవకాశం లేని వేళ.. టార్గెట్ చేసి మరీ ఫలానా ప్రాంతంలో కురిపించేలా మేఘాల్ని డైరెక్టు చేసే సత్తా ఎవరికి ఉందన్నది ఇప్పుడున్న ప్రశ్న. మరి.. దీనికి సమాధానం చెప్పేవారెవరో?