Begin typing your search above and press return to search.

పెన్సిల్వేనియా వివాదం ఏమిటి? ట్రంప్ వాదన ఏమిటి?

By:  Tupaki Desk   |   8 Nov 2020 7:00 AM GMT
పెన్సిల్వేనియా వివాదం ఏమిటి? ట్రంప్ వాదన ఏమిటి?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించిన తర్వాత కూడా ట్రంప్ మాత్రం నో అంటే నో అనేస్తున్నారు. ఆయన గెలిచానంటే సరిపోతుందా? లీగల్ ఫైట్ లో కానీ లెక్క తేలదంటున్నారు. అంతేకాదు.. బైడెన్ గెలిచినట్లుగా ఇప్పటివరకు ఒక్క రాష్ట్రమైనా వెల్లడించిందా? అంటూ కొత్త ప్రశ్నను తెర మీదకు తెస్తున్నారు. ట్రంప్ నోట వస్తున్న మాటలన్ని ప్రాసెస్ లో పూర్తి అయ్యేవే. సాంకేతిక అంశాల్ని పట్టుకొని ఆయన అదే పనిగా మాట్లాడుతున్న తీరు చూస్తే.. విషయాల్ని ఇష్యూ చేయటమే తప్పించి మరింకేమీ లేదన్నట్లుగా ఉందని చెప్పక తప్పదు.

బైడెన్ గెలుపులో కీలకం పెన్సిల్వేనియా గెలుపు. అయితే.. అసలు అది గెలుపే కాదన్నది ట్రంప్ వాదన. ఇంతకీ ఈ వివాదం ఏమిటి? అన్నది చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. అమెరికా ఎన్నికల్లో విచిత్రమైన అంశాలు చాలానే కనిపిస్తాయి. దేశం ఒక్కటే అయినా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిబంధన ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానిదే.

ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు విరాళాలు సేకరించే విషయంలోనూ.. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో నిబంధన అమలవుతుంటుంది. ఫలితాల వెల్లడిలోనూ అలాంటి పరిస్థితే ఉంటుంది. నెవడా రాష్ట్రం విషయానికి వస్తే.. పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాతే ఫలితాన్ని ప్రకటించే సంప్రదాయం ఉంది. అలా చూస్తే.. పోలింగ్ ముగిసిన రెండు రోజులకే ఫలితం రావాల్సి ఉంది. ఈ రాష్ట్రం కింద ఆరు ఎలక్టోరల్ కాలేజీఓట్లు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు మొదలు పెట్టగానే ఫలితం త్వరగా వచ్చేస్తుంది. సమస్య ఏమంటే..ఈసారి పోస్టల్ ఓట్లు ఎక్కువగా రావటంతో.. ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. దీంతో ఫలితం వెల్లడి ఒక రోజుకు పైగా ఆలస్యమైంది.

ఇక.. ట్రంప్ లేవనెత్తి పెన్సిల్వేనియా రాష్ట్ర వివాదంలోకి వెళితే.. పోలింగ్ జరిగిన రాత్రి 8 గంటల తర్వాత వచ్చిన పోస్టల్ ఓట్లను పక్కన పెట్టాలని ట్రంప్ కోరుతున్నారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత పోలైన ఓట్లను ఎలా లెక్కిస్తారన్నది ఆయన వాదన. అయితే.. పోలింగ్ ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు వచ్చే పోస్టల్ బ్యాలెట్లను కూడా లెక్కించొచ్చు అంటూ..వాటిని లెక్కలోకి తీసుకోవచ్చంటూ పెన్సిల్వేనియాలోని ఒక కోర్టు స్పష్టంచేసింది.

ఇది తప్పని.. అక్రమాలకు తావిస్తుందని చెబుతూ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టు చెప్పినట్లే చేయటం తప్పెలా అవుతుందన్నది బైడెన్ వాదన. ఇదిలా ఉంటే.. ట్రంప్ టీం చేసిన సవాల్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పెన్సిల్వేనియాలో పోలింగ్ రోజురాత్రి 8 గంటల తర్వాత వచ్చిన ఓట్లను పక్కన పెట్టాలని.. వేరుగా ఉంచాలని సుప్రీం చెప్పింది. అయినప్పటికీ.. బైడెన్ అధిక్యం ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ఈ ఇష్యూలో తనదే విజయమన్న నమ్మకంతో ట్రంప్ ఉన్నారు. మరేం జరుగుతుందో చూడాలి.