Begin typing your search above and press return to search.

హుజూరాబాద్‌పై ప‌వ‌న్ వ్యూహ‌మేంటి? టెన్ష‌న్ పాలిటిక్స్‌

By:  Tupaki Desk   |   15 Aug 2021 1:30 PM GMT
హుజూరాబాద్‌పై ప‌వ‌న్ వ్యూహ‌మేంటి?  టెన్ష‌న్ పాలిటిక్స్‌
X
తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక విష‌యంలో అధికార పార్టీ టీఆర్ ఎస్‌, ప్ర‌తిప‌క్షం.. బీజేపీలు తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యాయి. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్‌.. టీఆర్ ఎస్‌కు గుడ్‌బై చెప్పిన ద‌రిమిలా.. ఈ ఉప ఎన్నిక వ‌చ్చిన నేప‌థ్యంలో ఈట‌ల‌ను ఓడించాల‌ని.. అధికార పార్టీ కంక‌ణం క‌ట్టుకుంది. ఆదిశ‌గా దూకుడుగా ఉంది. అనేక ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డంతోపాటు.. కీల‌క‌మైన ద‌ళిత బంధును కూడా అమ‌లు చేసేందుకురెడీ అయింది. అయితే.. ఇదే స‌మ‌యంలో కేసీఆర్‌కు షాకివ్వాల‌నే ఏకైక ఉద్దేశంతో ఈట‌ల కూడా ఉన్నారు.

ఈ క్ర‌మంలో ఈట‌ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీ కూడా ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దీంతో ఇప్ప‌టికే ఈట‌ల పాద‌యాత్ర చేస్తున్నారు అదేస‌మ‌యంలో బీజేపీరాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్ కూడా యాత్ర‌లు ప్రారంబించారు. అంటే.. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజ‌కీయంగా అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇక్క‌డ క‌నుక టీఆర్ ఎస్ ఓడిపోతే.. త‌న‌కు ఇబ్బంది త‌ప్ప‌ద‌ని పార్టీ అధినేత‌.. సీఎం కేసీఆర్ బావిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఈట‌ల ఓడిపోతే.. ఆయ‌న హ‌వా.. ఏమీ లేద‌ని.. అంతా టీఆర్ ఎస్ వ‌ల్లే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు చేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాలు.. శ‌క్తియుక్తులు కూడ‌గట్టి ఇక్క‌డ విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహ‌మేంటి? ఆయ‌న ఎలా ముందుకు సాగుతారు? అస‌లు బీజేపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తారా? లేక‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పీవీ కుమార్తెకు మ‌ద్ద‌తిచ్చిన‌ట్టు.. ఇప్పుడు కూడా టీఆర్ ఎస్ కే జైకొడ‌తారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ఈ ఎన్నిక‌ల విష‌యంలో జోక్యం చేసుకోలేదు. నిజానికి ఆయ‌న అవ‌స‌రం ఇప్పుడు బీజేపీకి ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. టీఆర్ ఎస్‌కు ఇక్క‌డ ఓట‌మిని చ‌విచూపించ‌డం ద్వారా.. రాష్ట్రంలో బ‌ల‌మైన శ‌క్తి, టీఆర్ ఎ స్‌ను ఎదిరించే పార్టీ త‌మ‌దేన‌ని చెప్పుకొనేందుకు బీజేపీ చెప్పుకొనే అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ చూపులు ప‌వ‌న్ వైపు ఉన్నాయ‌ని అంటున్నారుప‌రిశీల‌కులు.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన కొన్ని ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. బీజేపీతో తమకు పొత్తుందని జనసేన నేతలు చెబుతున్నా రు. కానీ, ఒక సంద‌ర్భంలో జనసేనతో తమకు ఎలాంటి పొత్తులేదని స్వయంగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయే ప్రకటించారు. అంతేకాదు.. అది ఏపీ వ‌ర‌కే ప‌రిమిత‌మ‌ని.. త‌మ‌ది ఒంట‌రి పోరేన‌ని చెప్పుకొచ్చారు. పోనీ.. పొత్తులు లేకపోయినా గ్రేటర్ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులను పోటీ చేయనీయకుండా బీజేపీ నేతలు విత్ డ్రా చేయించారు.ఈ క్ర‌మంలోనే త‌మ‌కు బీజేపీ అన్యాయం చేసిందంటూ.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ముందు.. ప‌వ‌న్ ప్ర‌క‌టించార‌నే వాద‌న ఉంది.

ఇక‌, దుబ్బాక ఉప ఎన్నిక‌లోను, నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లోనూ బీజేపీకి ప‌వ‌న్ చేతులు క‌లుప‌లేదు. అయితే ఆ తర్వాత జరిగిన ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేశాయి. అంటే ఈ రెండు పార్టీలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తున్నాయన్న రాజ‌కీయంగా ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. ఈ క్ర‌మంలో హుజూరాబాద్ ఉపఎన్నికలో జనసేన స్టాండ్ ఏమిటి? బీజేపీకి సహకారం అందిస్తుందా ? లేకపోతే మ‌రోసారి టీఆర్ ఎస్‌కే మ‌ద్ద‌తిచ్చే క్ర‌మంలో మౌనంగా ఉండిపోతుందా? లేక‌, త‌నే స్వ‌యంగా బ‌రిలోకి దిగి అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తుందా? అనే విష‌యాలు రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. మ‌రి ప‌వ‌ర్ స్టార్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.