Begin typing your search above and press return to search.

దక్షిణాది పసందైన వంటకం సాంబార్ పుట్టిల్లు ఏది?

By:  Tupaki Desk   |   11 Jun 2021 12:30 AM GMT
దక్షిణాది పసందైన వంటకం సాంబార్ పుట్టిల్లు ఏది?
X
పప్పును మెత్తగా ఉడకబెట్టి, దానిలో మునగకాయ, సొరకాయ, టమోటా, క్యారట్, గుమ్మడి కాయ, బెండకాయ, కొత్తమీర, కరివేపాకు, చింతపండు రసంతో ఎంతో రుచికరమైన సాంబార్ తయారు చేస్తారు. దక్షిణాది పసందైన వంటకమైన ఇది దేశవిదేశాల్లో ప్రాముఖ్యం పొందింది. సాంబార్ ఉంటే పిల్లల నుంచి పెద్దలదాకా లొట్టలేసుకుని తింటారు. మరి అంతటి పసందైన ఈ వంటకం ఎలా పుట్టింది? మొదట ఎవరు తయారు చేసేవారో తెలుసుకుందామా?

తంజావూరును పాలించిన మరాఠా వంటశాలలో ఈ ప్రత్యేక పదార్థాన్ని తొలిసారిగా తయారు చేసినట్లు చెబుతారు. ఛత్రపతి శివాజీ ఓ సారి తంజావూరు పర్యటనకు వెళ్లగా ఆయన కోసం ఓ ప్రత్యేక వంటకం తయారు చేశారట. రేగుపళ్లు లేకపోవడం వల్ల చింతపండు రసాన్ని వాడారట. దీనికి శివాజీ గౌరవార్థం శంభాజీ, ఆహార్ లను కలిపి సాంబార్ అని పేరు పెట్టినట్లుగా కొందరు చెబుతారు. ఈ కథనంపై పై మిశ్రమ స్పందన లభించింది. కొందరు దీనిని అంగీకరించగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

ఇడ్లీ, వరి అన్నంతో సాంబార్ తింటారు. పూర్వకాలంలో ఆహారం రుచి పెంచడానికి అన్ని పదార్థాలను వాడేవారు. దానికే సాంబార్ అని పేరు. సాంబార్ అనే పేరుకు చాలా అర్థాలున్నాయి. సలాడ్ తరహాలో ఈ పదాన్ని ఉపయోగించేవారు. సుగంధ ద్రవ్యాలకు, సాంబార్ కు ఒకే అర్థం వస్తుందని కొందరు అంటున్నారు. సాంబార్ అనే పదం మహారాష్ట్రలో ఎప్పటి నుంచో వాడుకలో ఉందని చెబుతున్నారు. చక్రధర స్వామి రచించిన లీలా చరిత్రలో దీని ప్రస్తావన ఉన్నట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. ముక్తేశ్వరకు చెందిన ఏక్ నాథ్ మహారాజు ముని మనవడు రాజసూయ యాగం చేస్తూ సాంబార్ గురించి ప్రస్తావించినట్లు సమాచారం.

పిష్వా కాలం నుంచే సాంబార్ వాడుకలో ఉందని చెబుతున్నారు. రఘునాథ భూదయము అనే కావ్యంలో రాజు తీసుకునే ఆహార జాబితాలో సాంబార్ ప్రస్తావన ఉంది. తంజావూరులో సాంబార్ ను కనిపెట్టినట్లుగా చెబుతున్నప్పటికీ అందుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారులు లేవు. పూర్వకాలంలో వంటకాల్లో కూళంబు అనే వంటకాన్ని వాడేవారని చరిత్రకారులు చెబుతున్నారు. కాలక్రమేణా అదే సాంబార్ గా మారిందని అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది ప్రజలకు పసందైన వంటకమైన సాంబార్ కు విదేశాల్లోని హోటళ్లలోనూ మంచి డిమాండ్ ఉంది.