Begin typing your search above and press return to search.

ప్రశాంతంగా బతకనివ్వరా సాములోరు? ఆధార్ కు హిందూ ధర్మానికి లింకేంది?

By:  Tupaki Desk   |   4 April 2023 10:09 AM GMT
ప్రశాంతంగా బతకనివ్వరా సాములోరు? ఆధార్ కు హిందూ ధర్మానికి లింకేంది?
X
సంచలనాల కోసం మాట్లాడే తీరు ఈ మధ్యన ఫ్యాషన్ గా మారింది. ప్రముఖులుగా నిలిచేందుకు.. వార్తల్లో హడావుడి చేసేందుకు కొందరు చేసే ప్రయత్నాలు కొత్త సమస్యలకు కారణమవుతుంటాయి. ఈ ప్రముఖులు తాము వదలాల్సిన విషయాన్ని మంది మీదకు వదిలేసి వెళ్లిపోతారు. కానీ.. అందుకు ప్రభావితం అయ్యేది సామాన్యులే తప్పించి.. సదరు ప్రముఖులు ఏ మాత్రం కాదు. ఈ చిన్న విషయాన్ని వదిలేసి.. సదరు ప్రముఖుల్ని భుజాన ఎత్తుకోవటం ద్వారా ఇబ్బందులే తప్పించి మరింకేమీ ఉండదన్న నిజాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

తాజాగా పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్య లే నిదర్శనం. ఆ మధ్యన తన మాటలతో కాస్తంత హడావుడి చేసిన ఈ సాము లోరు.. తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న వేళలో.. ఆయన వీధుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా జగిత్యాల పట్టణంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయాత్రలో ఆయన మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిందూ ధర్మపరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్నారు. దేశంలో హిందువులుగా జీవించే వారికి.. హిందువులు కాకున్నా.. హిందువులను గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులు ఇవ్వాలన్నారు. ఇందుకోసం పార్లమెంటు మొదలు అన్నిస్థాయాల్లో ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాలన్నారు.

జగిత్యాలకు చెబితే జగమంతా చెప్పినట్లేనని.. అందుకే తాను ఈ విషయాన్ని ఇక్కడ చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. తాను చెప్పిన ఈ అంశం దేశ వ్యాప్తంగా జరగాలని పేర్కొన్నారు. సాములోరి మాటల్నివింటే.. సమాజంలో శాంతిని కాక్షించే ఏ ఒక్క బుర్ర ఉన్న వ్యక్తి అయినా ఇలాంటి వాటిని ఖండించక మానదు. ఎవరికి వారు వారికి నచ్చిన ధర్మాన్ని ఇష్టపడతారు. గౌరవిస్తారు. అభిమానిస్తారు.. ఆరాధిస్తారు. అందుకు భిన్నంగా మెజార్టీలు తమ ధర్మాన్ని మిగిలిన వారంతా గౌరవిస్తామన్నడిక్లరేషన్ ఇస్తేనే గౌరవించినట్లా? అయినా.. ఎవరి బతుకు వారు బతుకుతున్నప్పుడు.. ఇలాంటి విభజనలు ఎందుకు? అన్నది ప్రశ్న.

ఇలాంటి వాదనల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా.. అనవసరమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందే తప్పించి.. మరింకేమీ ఉండదన్నది మర్చిపోకూడదు. సమాజంలో చీలికకు ఇలాంటి వ్యాఖ్యలు కారణమవుతాయి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలంటూ మతం ఆధారంగా సమాజం చీలిపోవటం.. దేశానికి ఏ మాత్రం క్షేమకరం కాదన్నది మర్చిపోకూడదు.

సాము లోరి వాదననే పరిగణలోకి తీసుకుంటే.. ఈ దేశానికి ఆ దేశం.. తమ దేశంలో మెజార్టీలు ఉన్న మతాన్ని.. మత విశ్వాసాల్ని తాను గౌరవిస్తానంటూ డిక్లరేషన్ ఇస్తే కానీ.. గుర్తింపుకార్డులు ఇవ్వనంటే ఎలా ఉంటుంది? దాదాపుగా అలాంటి తీరే పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యల్లోనూ ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి పైత్యం మాటలతో సమాజం మరింతగా చీలికలకు కారణమవుతుందన్నది నిజం. ఆ చిన్న అంశం అంత పెద్ద సాములోరికి ఎందుకు అర్థం కానట్లు?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.