Begin typing your search above and press return to search.

నాలుగో గోడల మధ్య జరిగితే ఎస్టీ..ఎస్సీ చట్టం వర్తించదు.. సుప్రీం స్పష్టం

By:  Tupaki Desk   |   6 Nov 2020 6:15 AM GMT
నాలుగో గోడల మధ్య జరిగితే ఎస్టీ..ఎస్సీ చట్టం వర్తించదు.. సుప్రీం స్పష్టం
X
ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ చట్టానికి అనుగుణంగా నమోదైన కేసు విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తననను కులం పేరుతో తిట్టినట్లుగా ఆరోపిస్తూ ఒక మహిళ ఆరోపించిన కేసును కొట్టివేస్తూ.. సుప్రీం ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ చట్టంపై మరింత స్పష్టత ఇవ్వటమే కాదు.. కీలక వ్యాఖ్యలు చేసింది. గదిలో నాలుగు గోడల మధ్య సాక్ష్యులెవరూ లేని చోట ఎస్సీ..ఎస్టీ తెగలకు చెందిన వ్యక్తిని అవమానించారని.. బెదిరించారని చేసే ఆరోపణలకు ఎస్సీ.. ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద నేరంగా పరిగణించలేమని పేర్కొంది.

ఉత్తరాఖండ్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం 2019 డిసెంబరు 10న వర్మ అనే వ్యక్తి తనను అవమానించారని ఒక మహిళ ఆరోపించారు. వర్మకు.. మహిళకు మధ్యనున్న ఆస్తి వివాదం సివిల్కోర్టులో ఉండగా.. వర్మ తనను వేధిస్తున్నారంటూ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. వర్మ తరఫు న్యాయవాది.. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తన క్లయింట్ కున్న సివిల్ కేసు కోర్టులో ఉందని..ఆ సమయంలో ఎస్సీ.. ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగంచేస్తూ కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.

అసలు వివాదం ఆస్తికి సంబంధించి కాబట్టి.. దాని కారణంగా తలెత్తే ఆరోపణల్ని ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకు తీసుకురాకూడదని సుప్రీం పేర్కొంది. ఒక భవనం వెలువల ఉన్న ఆరు బయట ప్రాంతంలో జరిగే విషయాల్ని రోడ్డు పైన వెళ్లే వ్యక్తులు.. ప్రహరీ వెలుపల ఉన్న వ్యక్తులు చూడటానికి వీలవతుందరి సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

అంతేకాదు.. తాజా కేసులో నేరం జరిగిన సమయంలో మహిళ తన ఇంటి గదిలో ఉన్నారు. అక్కడ జరిగిన వ్యవహారాన్ని ఆమె కుటుంబ సభ్యులు మినహా ఇతరులు చూసే వీల్లేదు.. కనుక ఆ మహిళ చేసిన ఆరోపణలకు ఆధారంగా తాము విన్నట్లుగా సాక్ష్యుల మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇటీవల కాలంలో ఎస్సీ.. ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నవేళ.. సుప్రీం ఇచ్చిన తీర్పు.. రానున్న రోజుల్లో పలు కేసులకు కీలకమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.