Begin typing your search above and press return to search.

ఉత్తమ ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ర్యాంక్ ఎంత?

By:  Tupaki Desk   |   16 Jan 2021 3:30 AM GMT
ఉత్తమ ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ర్యాంక్ ఎంత?
X
కొన్నిసార్లు కష్టాలు చెప్పి రావు. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి మీద పడిపోతుంటాయి. కొన్నింటితో తమకు సంబంధం లేకున్నా.. వాటి తాలుకూ ప్రభావానికి గురి కావాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉందని చెప్పాలి. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలి.. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆయన.. ఢిల్లీ పర్యటనకు వెళ్లి రావటం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తీరులోనూ.. నిర్ణయాలు తీసుకోవటంలోనూ వేగం పెరిగింది.

ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ చానల్.. దేశ వ్యాప్తంగా ఉత్తమ ముఖ్యమంత్రులు ఎవరు? అన్న దానిపై అధ్యయనం చేసింది. దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. టాప్ త్రీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహించటంలో ఆయన ప్రదర్శిస్తున్న దూకుడుకు వచ్చిన గుర్తింపుగా చెప్పాలి.

ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ అధ్యయన వివరాల్ని వెల్లడించారు. మొదటి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయ్.. రెండో స్థానంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిలిచారు. మరి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి ఏమిటి? ఆయనకు వచ్చిన ర్యాంకు మాటేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. షాకింగ్ గానూ.. సర్ ప్రైజింగ్ గాను ఉంటుందని చెప్పాలి. జాబితాలోచివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచారు.

జాబితాలో చిట్టచివరి స్థానాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నిలువగా.. హర్యానా రాష్ట్ర సీఏం ఖట్టర్ చివరి నుంచి రెండో స్థానంలో.. పంజాబ్ ముఖ్యమంత్రి జాబితాలోకింద నుంచి మూడోస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారు. కేసీఆర్ తర్వాతి స్థానంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఉన్నారు. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా ప్రధాని పని తీరుపై నిర్వహించిన సర్వేలో.. 66 శాతం మంది సంతోషంతో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సర్వేలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా టాప్ లో నిలిచిన ఒడిశా ముఖ్యమంత్రి రాష్ట్రంలో.. అక్కడి ప్రజల్లో 91 శాతం మంది మోడీ సర్కారు పని తీరుపై సంతృప్తికరంగా ఉన్నట్లు పేర్కొనటం గమనార్హం.