Begin typing your search above and press return to search.

ఏపీ మూడు రాజధానుల బిల్లు చరిత్ర ఏంటి?

By:  Tupaki Desk   |   22 Nov 2021 9:37 AM GMT
ఏపీ మూడు రాజధానుల బిల్లు చరిత్ర ఏంటి?
X
ఏపీ సీఎం జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకొన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టుకు తెలిపారు. సోమవారం ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం అత్యవసరంగా జరిగింది. ఈ సమావేశంలో మూడు రాజధానులపై ఏపీ సర్కార్ తీసుకొన్న చట్టాన్ని వెనక్కి తీసుకొన్నట్టుగా అడ్వకేట్ జనరల్ ఇవాళ హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీ మూడు రాజధానుల బిల్లు చరిత్ర ఏంటి.. అందులో ఏముందో తెలుసుకుందాం..

2020 జనవరి 20న ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై ప్రవేశపెట్టిన బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. అమరావతికి సంబంధించి చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సీఆర్డీఏను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది.

అయితే ఏపీ శాసనమండలిలో మాత్రం ఈ బిల్లును టీడీపీ అడ్డుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి ఆపుచేసింది. 2020 జూన్ 17న రెండోసారి ఈ బిల్లులను శాసనమండలికి పంపారు.

ఇక ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు-2020 లకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 2020 జులై 31న ఆమోదం తెలిపారు. శాసనమండలికి రెండు దఫాలు పంపిన తర్వాత నెలరోజుల గడువు పూర్తైతే అలాంటి బిల్లులు ఆమోదం పొందినట్టే పరిగణించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం ఇటీవల ఈ మూడు బిల్లులకు ఆమోదం పంపింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు

ఈ మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దీనిపై హైకోర్టుకు అమరావతి రైతులు, టీడీపీ, మేధావులు వెళ్లి అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఈ బిల్లులను జగన్ సర్కార్ వెనక్కి తీసుకుంటూ నిర్ణయించింది. మళ్లీ ఏం చేస్తుందనేది వేచిచూడాలి.