Begin typing your search above and press return to search.

గుంటూరు నడిబొడ్డున ఉండే జిన్నా టవర్ చరిత్ర ఏంటి?

By:  Tupaki Desk   |   31 Dec 2021 8:31 AM GMT
గుంటూరు నడిబొడ్డున ఉండే జిన్నా టవర్ చరిత్ర ఏంటి?
X
ఆయన ఎంతో మంచి వాడని కొందరు కీర్తిస్తారు. ఆయనలోని మంచి కోణాల్ని గొప్పగా చెప్పుకుంటారు. ఆయన్ను అభిమానించేవాళ్లు కొందరైతే.. అంతకుమించి అన్నట్లు ఆరాధించేటోళ్లకు కొదవ లేదు. ఏది ఏమైనా.. ఆయన్ను భారతీయులు మాత్రం ప్రేమించలేరు. అభిమానించలేరు. కారణం.. దేశాన్ని రెండు ముక్కలు చేయటంతో పాటు.. దారుణ హింసకు.. రక్తపాతానికి ఆయన విధానాలు కారణమన్న విషయాన్ని మర్చిపోలేం. దీన్ని విభేదించేటోళ్లు దేశంలో ఉండొచ్చు. అది దేశం చేసుకున్న దురదృష్టంగా చెప్పాలి. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. దేశ విభజనకు పాల్పడి.. దాయాదుల మధ్య ఎప్పటికి తెగని చిచ్చు పెట్టిన నేత.. మహ్మద్ అలీ జిన్నా.

ఆయన పేరు మీద గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్న కట్టటం. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఏపీలోని బీజేపీ నేతలే. ఇప్పుడు వారో సంచలన ప్రకటన చేశారు. జిన్నా టవర్ పేరును మార్చాలని.. లేనిపక్షంలో అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చేసినట్లుగా.. జిన్నా టవర్ ను కూడా కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో.. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న రాజకీయాలకు భిన్నమైన రాజకీయ వాతావరణం తాజాగా తెర మీదకు వచ్చింది. జిన్నా టవర్ ను కూలుస్తామన్న ప్రకటన పొలిటికల్ హీట్ ను రగల్చటమే కాదు.. వాద.. ప్రతివాదనలకు అవకాశాన్ని ఇచ్చింది. వాస్తవ కోణంలో చూస్తే.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును పలకాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. దేశాన్ని రెండు ముక్కలు చేసిన జిన్నా పేరుకు బదులుగా.. ఇతర ముస్లిం మహనీయుల పేరును పెడితే సబబుగా ఉంటుంది.

దీనికి తగ్గట్లే ఏపీ బీజేపీ నేతలు జిన్నా టవర్ పేరు మార్చాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. అయితే.. ఈ డిమాండ్ బీజేపీ నేతల నోటి నుంచి రావటంతో.. ఆ పార్టీని వ్యతిరేకించే వారు.. ఆ డిమాండ్ ను తప్పు పడుతున్నారు. దీంతో.. ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ గుంటూరు సెంటర్ లో ఉన్న టవర్ కు జిన్నా టవర్ అని ఎందుకు పేరు పెట్టారు? అసలు ఆ టవర్ ను ఎందుకు నిర్మించారు? అన్న విషయాల్ని తెలుసుకునేందుకు చరిత్రలోకి వెళ్లాల్సిందే.

1942లో ఇప్పటి సత్తెనపల్లి మండలం కొమ్మదిపూడిలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీన్ని స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంగా మరల్చి.. ఆ వివాదంలో 14 మంది ముస్లింలకు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించారు. దీన్ని సవాలు చేసిన అప్పటి గుంటూరు ప్రజాప్రతినిధి ముంబయి కోర్టులో ప్రముఖ న్యాయవాదిగా పేరున్న ముస్లింలీగ్ అధినేత మహ్మద్ అలీ జిన్నాను కలిశారు. 14 మంది ముస్లింల తరఫున వాదించాలని కోరారు.

దీంతో.. ఒప్పుకున్న జిన్నా.. అందుకు తగ్గట్లే కేసును వాదించి.. కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయించారు. దీనికి గుర్తుగా 1942లో అప్పటి ఉద్యమకారులు మహ్మద్ అలీ జిన్నా పేరుతో గుంటూరులో ఒక టవర్ ను నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి ఆయన్ను ఆహ్వానించారు. కానీ.. వీలు కాకపోవటంతో జిన్నా రాలేదు. కానీ.. ఆయన తరఫున జిన్నా అనుచరుడు జులేదా లియాఖత్ అలీఖాన్ 1945లో ఈ టవర్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ టవర్ నిర్వాహణను గుంటూరు స్థానిక సంస్థ.. ప్రస్తుతం కార్పొరేషన్ చూసుకుంటోంది. ఇది కాస్తా.. గుంటూరు ప్రజల జన జీవితంలో భాగమై.. జిన్నా టవర్ సెంటర్ గా మారింది.

అయితే.. దీని పేరును మార్చాలని 1965-66 మధ్యన అప్పటి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అప్పట్లో పాక్ తో యుద్ధం జరుగుతున్న వేళ.. భారతీయ సైనికుడు క్వార్టల్ మార్షల్ హమీద్ ఈ యుద్ధంలో వీర మరణం పొందారు. ఆయన గౌరవార్ధం.. ఆయన పేరును జిన్నా టవర్ కు పెట్టాలని నిర్ణయించారు. కానీ.. ఆ తీర్మానం అమలు కాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీ నేతలు మాత్రం గతంలో చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయాల్ని పక్కన పెట్టి.. సాపేక్షంగా చూసినప్పుడు.. గతంలో కౌన్సెల్ తీర్మానాన్ని అమలు చేయాలని కోరటంలో తప్పు లేదు. అదే సమయంలో.. దాన్ని రాజకీయం చేసి.. మతాల మధ్య దూరం పెంచాలన్న బీజేపీ ఆలోచన కూడా సరికాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.