Begin typing your search above and press return to search.

సుజ‌య్ కృష్ణ‌రంగారావు ఫ్యూచ‌రేంటి? టీడీపీ ప‌క్క‌న పెట్టేసిందిగా!

By:  Tupaki Desk   |   30 Sep 2020 4:00 AM GMT
సుజ‌య్ కృష్ణ‌రంగారావు ఫ్యూచ‌రేంటి?  టీడీపీ ప‌క్క‌న పెట్టేసిందిగా!
X
రాజ‌కీయాల్లో కావాల్సింది ఏంటి? అని ఇప్ప‌టి త‌రం నాయ‌కుల‌ను అడిగితే.. `అధికారం-అవ‌కాశం` అనే మాట‌ల‌నే చెబుతారు. నిజ‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది అధికారం.. కోస‌మే. అయితే, కేవ‌లం దీని కోస‌మే పాకులాడితే.. మొత్తానికే కుంప‌టి వ‌చ్చే అవ‌కాశం ఎదుర‌వుతుంద‌నేది వాస్త‌వం. సాఫీగా సాగిపోతున్న రాజ‌కీయ ప్ర‌యాణంలో ప‌ద‌వుల కోసం ఆశ‌ప‌డి గ‌మ‌నాన్ని చిత్తు చేసుకున్న నాయ‌కులు చాలా మంది ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు పాల‌న‌లో ఆయ‌న ఎర‌వేసిన.. ప‌ద‌వుల‌కు ఆశ‌ప‌డిన వారు రాజ‌కీయంగా త‌మ‌కు తామే.. ఇబ్బందులు కొనితెచ్చుకున్నార‌ని అనేవారు క‌నిపిస్తారు.

ఇలాంటి వారిలో సుజ‌య‌కృష్ణ‌రంగారావు ఒక‌రు. విజ‌య‌న‌గరం జిల్లా బొబ్బిలి వంశ రాజులైన ఈ కుటుంబం కాంగ్రెస్‌లో రాజ‌కీయాలు ప్రారంభించి.. వైఎస్‌కు ఆత్మీయ‌బంధువులుగామారింది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ టికెట్‌పై బొబ్బిలి నుంచి తిరుగులేని విజ‌యం అందుకున్నారు సుజ‌య‌కృష్ణ‌. 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం సాధించిన ఆయ‌న‌.. 2014లో వైసీపీలో చేరి. ఆ పార్టీ టికెట్‌పైనా విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇలా హ్యాట్రిక్ సంపాయించుకున్న స‌జ‌య్‌.. చంద్ర‌బాబు ఆక‌ర్ష్ వ‌ల‌కు చిక్కుకుని పార్టీ మారి సైకిల్ ఎక్కారు. ఈ క్ర‌మంలోనే గ‌నుల శాఖ మంత్రి అయ్యారు.

అయితే,ఈ ఆనందం ఎంతో కాలం నిల‌వ‌లేదు. కాంగ్రెస్ సానుభూతిప‌రులు ఎక్కువ‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం త‌ద‌నంత‌ర కాలంలో వైసీపీకి మ‌ద్ద‌తు తెలిపింది. దీంతో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు సుజ‌య్‌. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న పొలిటిక‌ల్ గ్రాఫ్ పుంజుకోలేదు స‌రిక‌దా.. మ‌రింత‌గా దిగ‌జారిపోయింది. తాజాగా పార్టీలోనూ గుర్తింపు లేకుండా పోయింది. చంద్ర‌బాబుకూడా ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశారు. చిత్రం ఏంటంటే.. సుజ‌య్ సోద‌రుడు బేబినాయ‌న వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఇది చంద్ర‌బాబుకు ఇష్టంలేదు.

దీంతో ఇద్ద‌రు సోద‌రుల‌ను ఆయ‌న దాదాపు ప‌క్క‌న పెట్టారు. ఇటీవ‌ల నియ‌మించిన పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌ల ప్లేస్‌లో సుజ‌య్ పేరు ఉంటుంద‌ని ఆయ‌న అనుచ‌రులు భావించినా. చంద్ర‌బాబు ఆయ‌న‌కు చోటు ఇవ్వ‌లేదు. దీంతో ఇప్పుడు కిం క‌ర్త‌వ్యం? అని సుజ‌య్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు జిల్లాలో టాక్ న‌డుస్తోంది. ఏదేమైనా చేసుకున్న‌వారికి చేసుకున్నంత‌! అంటారు క‌దా!! అదే ఇప్పుడు సుజ‌య్ విష‌యంలో నిజ‌మైంద‌ని అంటున్నారు. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.