Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ పై తీరుగుబాటా.. భ‌విష్య‌త్ ఏంటీ?

By:  Tupaki Desk   |   21 May 2021 2:30 AM GMT
క‌మ‌ల్ పై తీరుగుబాటా.. భ‌విష్య‌త్ ఏంటీ?
X
సినిమాల్లో క‌మ‌ల్ హాస‌న్ తిరుగులేని న‌టుడు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లూ ఆద‌రించారు. లోక‌నాయ‌కుడిని చేశారు. కానీ.. రాజ‌కీయాల్లో ముఖ్య‌మంత్రిని కాదుగ‌దా.. ఎమ్మెల్యేను కూడా చేయ‌లేదు. అయితే.. సినిమాకు, రాజ‌కీయానికి పోలిక పెట్ట‌లేం. క‌మ‌ల్ లాంటి న‌టుడికి క‌థ బాగుంటే చాలు బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డిపోద్ది. కానీ పాలిటిక్స్ అలా కాదు. ప్ర‌జ‌ల మ‌న‌సు గెలువాలి. ప్ర‌త్య‌ర్థుల దాడులు అధిగ‌మించాలి. చివ‌ర‌కు ఓట్లు సంపాదించ‌డంలో గెల‌వాలి. కానీ.. ఇక్క‌డ క‌మ‌ల్ ఓడిపోయారు. కార‌ణాలు ఏవైనా చెప్పుకోనీ.. అతిమంగా ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. పార్టీ కూడా ఓడిపోయింది.

అయితే.. ఎన్నిక‌లు ముగిశాయో లేదో.. మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ నుంచి ఒక్కొక్క‌రుగా వెళ్లిపోతున్నారు. వాళ్లంతా పార్టీలో కీల‌క నేత‌లుగా ఉన్న‌వారే. పార్టీ ఓడిపోయింది కాబ‌ట్టి వాళ్లు వ‌దిలేసి వెళ్తున్నారు స్వార్థప‌రులు అనుకోవ‌చ్చు. కానీ.. వెళ్లే వాళ్లంతా క‌మ‌ల్ పై ఒకేవిధ‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ వెళ్ల‌డ‌మే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పార్టీలో కీల‌క నేత‌లుగా ఉన్న ఏజీ మౌర్య‌, మురుగ‌నంద‌న్, సీకే.కుమరావెల్‌, ఉమాదేవీ ఫ‌లితాలు వ‌చ్చిన వారంలోనే వెళ్లిపోయారు. కాస్త గ్యాప్ తో పార్టీ ఉపాధ్య‌క్షుడు మ‌హేంద్ర‌న్ కూడా వెళ్లిపోయారు. ఆయ‌న పోతూ పోతూ క‌మ‌ల్ పై నాలుగు రాళ్లు విసిరేసి పోయారు. క‌మ‌ల్ కు పార్టీని న‌డిపే విధానం తెలియ‌ద‌ని, పార్టీలో ప్ర‌జాస్వామ్యం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించి వెళ్లిపోయారు.

తాజాగా.. మ‌రో కీల‌క‌నేత‌గా ప‌నిచేసిన సీకే కుమ‌రావేల్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. వెళ్తూ.. ఈయ‌న కూడా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. పార్టీ స్థాపించిన త‌ర్వాత క‌మ‌ల్ ప్ర‌వ‌ర్త‌న పూర్తిగా మారిపోయింద‌ని, వ‌న్ మ్యాన్ ఆర్మీగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల్లో పార్టీలోని ఇత‌ర అభ్య‌ర్థుల గెలుపు గురించి ప‌ట్టించుకోలేద‌ని, కేవ‌లం త‌న ఎమ్మెల్యే స్థానంపైనే దృష్టిపెట్టార‌ని అన్నారు.

దీంతో.. క‌మ‌ల్ వ్య‌వ‌హారశైలి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కీల‌క నేత‌లంతా విమ‌ర్శ‌లు చేస్తూ వెళ్లిపోతుండ‌డంతో.. అందులో వాస్త‌వం ఎంత అని చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి వ్య‌క్తిగా ఉన్న‌ప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రించినా న‌డుస్తుంది.. కానీ రాజ‌కీయాల్లో అంద‌రినీ క‌లుపుకొని వెళ్లాలి. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ప‌ట్టూ విడుపుల‌ను అల‌వాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా క‌మ‌ల్ కు తెలియ‌ద‌ని చెప్ప‌లేం. కానీ.. అప్లై చేయ‌డంలో ఖ‌చ్చితంగా తేడా ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. వ‌రుస‌గా నేత‌లు వెళ్లిపోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

అయితే.. వెళ్లిపోయేవాళ్లంతా క‌లుపు మొక్క‌లే.. ఎంత మంది పోయినా ఇబ్బంది లేదు అంటున్నారు క‌మ‌ల్‌. త‌క్ష‌ణ స్పంద‌న‌గా ఇలాంటి కామెంట్లు బాగుంటాయి. కానీ.. ఇలా ఒక్కొక్కొరుగా వెళ్లిపోవ‌డం పార్టీకి న‌ష్టం కాద‌ని ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. మొత్తానికి క‌మ‌ల్ రాజ‌కీయంగా చాలా ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారు. మ‌రి, ఈ ప‌రిస్థితిని ఆయ‌న ఎలా ఎదుర్కొంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. రాబోయే ఐదేళ్లు పార్టీని కాపాడుకోవ‌డం ఖ‌చ్చితంగా స‌వాలే. మ‌రి, పార్టీని న‌డుపుతారా? లేక కఠిన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. వీట‌న్నింటికీ కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.