Begin typing your search above and press return to search.

హిజాబ్ వివాదానికి పరిష్కారమిదేనా ?

By:  Tupaki Desk   |   23 Feb 2022 4:33 AM GMT
హిజాబ్ వివాదానికి పరిష్కారమిదేనా ?
X
కొద్దిరోజులుగా యావత్ దేశాన్ని ప్రధానంగా కర్నాటకను పట్టి కుదిపేస్తున్న హిజాబ్ వివాదానికి కర్నాటక ప్రభుత్వం పరిష్కారం కనిపెట్టిందా ? కర్ణాటక హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అందరికీ ఇలాంటి ఆలోచనలే మొదలయ్యాయి. హిజాబ్ ధరించటం తమ మతాచారమని ముస్లిం విద్యార్థులు, తల్లిదండ్రులు, మత సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి. అయితే హిజాబ్ ధరించడం అన్నది మతాచారం కానేకాదని ప్రభుత్వం వాదిస్తోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హిజాబ్ ధరించిన విద్యార్థినులను గుర్తుపట్టడం టీచర్లకు బాగా ఇబ్బంది అయిపోతోందట. ముఖ్యంగా అటెండెన్స్ తీసుకునేటపుడు, పరీక్షల సమయంలో హిజాబ్ టీచర్లకు బాగా ఇబ్బందులు సృష్టిస్తోందని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రతి ముస్లిం అమ్మాయి హిజాబ్ ధరించటంతో ఎవరు ఎవరో కూడా తమకు అర్థం కావటం లేదన్నది ప్రభుత్వ వాదన. దీన్ని ముస్లిం విద్యార్ధినులు అంగీకరించటం లేదు.

ఈ నేపధ్యంలోనే హిజాబ్ వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా కోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ హిజాబ్ ధరించటానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. అయితే కాలేజీలోకి ఎంటరయ్యేంతవరకు హిజాబ్ ఉంచుకోవచ్చని కూడా చెప్పారు. అయితే తరగతి గదిలోకి వెళ్ళే ముందు మాత్రం హిజాబ్ ను తీసేయాలని సూచించింది. దీనికి ముస్లిం సంఘాల స్పందన ఏమిటో తెలీలేదు.

మొత్తానికి ప్రభుత్వం తరపున హిజాబ్ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలనే ప్రయత్నమైతే కనబడుతోంది. మరి ముస్లిం విద్యార్ధినులు, సంఘాలు ఏమంటాయో చూడాలి.

ఇదే సందర్భంగా హిజాబ్ ధరించటం మతాచారం కాదని, ఖురానులో కూడా ఏమీ చెప్పలేదని మరికొందరు యువతులంటున్నారు. హిజాబ్ ధరించటం మతాచారమే అయితే హిజాబ్ ను అందరు ముస్లిం యువతులు ఎందుకు ధరించటం లేదని ప్రశ్నిస్తున్నారు. అందుకనే హిజాబ్ ధరించటం వ్యక్తిగత ఇష్టమనే అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. మరి ప్రభుత్వం తాజా పరిష్కారంపై హైకోర్టు ఏమంటుందో చూడాలి.