Begin typing your search above and press return to search.

పొత్తుల‌ పై పురందేశ్వ‌రి ప్ర‌భావం ఎంత‌? చంద్ర‌బాబుతో చేతులు క‌లుపుతారా?

By:  Tupaki Desk   |   4 July 2023 9:33 PM GMT
పొత్తుల‌ పై పురందేశ్వ‌రి ప్ర‌భావం ఎంత‌?  చంద్ర‌బాబుతో చేతులు క‌లుపుతారా?
X
ఏపీ బీజేపీ లో చోటు చేసుకున్న అనూహ్య ప‌రిణామాలు.. రాజ‌కీయంగా ఆస‌క్తి రేపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర సార‌థిగా ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ని ఎంపిక చేస్తూ.. పార్టీ అధిష్టానం నిర్ణ‌యించింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌ పై ఆమె ప్ర‌భావం ఎంత‌? అస‌లు పొత్తుల విష‌యం పై ఆమె స్పంద‌న ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజానికి వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించేందుకు.. పొత్తుల మంత్రాన్ని ప‌ఠిస్తున్న టీడీపీ, జ‌న‌సేన‌లు.. బీజేపీ ని ఒప్పించే ప‌ని లో ప‌డ్డాయ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇదే విష‌యాన్ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ కూడా త‌ర‌చుగా చెబుతున్నారు.

ఇక‌, టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు కూడా త‌ర‌చుగా అవ‌కాశం ఉన్న ప్రతిసారీ.. ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ పెద్ద‌ల‌ తోనూ ఆయ‌న భేటీ అవుతున్నారు. స‌మ‌యం .. సంద‌ర్భం కోసం...వేచి చూస్తున్నారు. ఎవ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా..కేంద్రం లోని పెద్ద‌లే ఒప్పుకొన్నా.. రాష్ట్ర‌స్థాయి లో పార్టీలు క‌లిసి ముందుకు న‌డ‌వాల్సిన అవ‌సరం ఉంది. ఈ విష‌యం లో ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ రాష్ట్ర‌ నేత‌ గా ఉన్న సోమువీర్రాజు.. పెద్ద‌గా స్పందించ‌లేదు. పైగా..చంద్ర‌బాబు పై ఆయ‌న కారాలు మిరియాలు నూరేవారు. ఇక‌, ప‌వ‌న్‌ తోనూ ఆయ‌న‌కు స‌ఖ్య‌త లేదు.

ఇలాంటి స‌మ‌యం లో పురందేశ్వ‌రికి ప‌గ్గాలు అప్ప‌గించ‌డంతో.. ఆమె మాత్రం టీడీపీ తో క‌లిసి న‌డుస్తుందా? ఆమె మాత్రం ప‌వ‌న్ తో క‌లిసి రాజ‌కీయాలు చేస్తారా? అనేది ప్ర‌ధాన చ‌ర్చ‌. ఎందుకంటే.. కుటుంబ ప‌రంగా.. రాజ‌కీయాల ప‌రంగాకూడా.. చంద్ర‌బాబు కు పురందేశ్వ‌రి కి మ‌ధ్య ఉన్న విభేదాలు.. ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. అయితే.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యం లో బీజేపీ-టీడీపీ క‌లిసి ప‌నిచేసిన‌ప్పుడు.. పురందేశ్వ‌రి రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. ఆ స‌మ‌యం లో రెండు పార్టీలు కూడా.. పొత్తులు పెట్టుకున్నాయి.

దీంతో పురందేశ్వ‌రి మెడ‌ లో టీడీపీ కండువా ను క‌ప్పుకొన్నారు. కానీ, పెద్ద‌గా ప్ర‌చారం లో మాత్రం పాల్గొన‌లేదు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు కూడా టీడీపీ ప్ర‌స్తావ‌న‌ను ఆమె తీసుకురాలేదు. ఇలాంటి స‌మ‌యం లో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పొత్తులు పెట్టుకుంటే..పురందేశ్వ‌రి.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తో క‌లిసి ప‌నిచేస్తారా? అనేది చ‌ర్చ‌. అదేవిధంగా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో ఆమె క‌లిసి అడుగులు వేయ‌గ‌ల‌రా? అనేది కూడా చ‌ర్చ‌నీయాంశంగానే మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. కుటుంబ వివాదాల‌ ను, రాజ‌కీయాల‌ ను వేర్వేరుగా చూడ‌గ‌లిగినా.. 'స‌ర్దుబాట్ల' విష‌యం లో పురందేశ్వ‌రి ఏమేర‌కు స‌ర్దుకుపోగ‌ల‌రా? అనేది చ‌ర్చ‌నీయాంశంగానే మారింది.