Begin typing your search above and press return to search.

బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే..?

By:  Tupaki Desk   |   11 Dec 2021 10:33 AM GMT
బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే..?
X
కరోనా వైరస్ దశలవారీగా విస్తరిస్తోంది. వివిధ రూపాంతరాలు చెందుతూ దశలవారీగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ అవసరమని నిపుణులు స్పష్టం చేశారు.

ఇటీవల ఉద్భవించిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు జెట్ స్పీడ్ తో వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. అంతేకాకుండా వివధ రకాల టీకాల బూస్టర్ డోసులపై దృష్టి సారించాయి. ఈ మేరకు సీరం సంస్థ కూడా... కొవిషీల్డ్ బూస్టర్ డోసు అనుమతికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై కేంద్రం స్పందించింది.

ఇప్పటివరకు రెండు డోసులుగా ఇస్తున్న కొవిషీల్డు మూడో డోసు దరఖాస్తుపై కేంద్ర సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ బృందం స్పందించింది. వైరస్ వ్యాప్తి చెందుతున్నా కూడా బూస్టర్ డోసు అవసరం లేదని కీలక ప్రకటన చేసింది.

ప్రస్తుతానికి మూడో డోసు అవసరం లేదని చెప్తూ... సీరం ఇనిస్టిట్యూట్ చేసిన దరఖాస్తును తిరస్కరించింది. భవిష్యత్ లో బూస్టర్ డోసు, అదనపు డోసుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ఇదివరకే వెల్లడించింది. మూడో డోసును, అదనపు డోసును వేర్వేరుగా పేర్కొంది. అవసరం ఉన్నవారికే అదనపు డోసు అని... బూస్టర్ అయితే అందరికీ ఇవ్వాలన్నట్లుగా కేంద్రం అభిప్రాయపడింది.

కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్న వేళ బూస్టర్ డోసు తీసుకుంటే మంచిదని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థలు అందుకు అనుగుణంగా దరఖాస్తులు చేసుకుంటున్నాయి.

అయితే ప్రస్తుతానికి కొవిషీల్డు బూస్టర్ డోసు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ టీకాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించింది. ఇకపోతే ఒమిక్రాన్ వంటి వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేసేలా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయాలని సూచించింది.

మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ ను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించారు. కాగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు.

కాగా దేశంలో ఇప్పటికే 32 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. అయితే ఒమిక్రాన్ పంజా విసిరితే... మూడో ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో... కేంద్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది.