Begin typing your search above and press return to search.

టైమ్స్ ఆఫ్ ఇండియాతో జగన్ సర్కారు చేసుకున్న ఒప్పందం ఏమిటి?

By:  Tupaki Desk   |   30 Oct 2020 4:45 AM GMT
టైమ్స్ ఆఫ్ ఇండియాతో జగన్ సర్కారు చేసుకున్న ఒప్పందం ఏమిటి?
X
ప్రభుత్వం చేసే ప్రతి పనిని భూతద్దంలో చూస్తూ.. అందులో తప్పులు వెతికటం.. అయిన దానికి కాని దానికి తమదైన శైలిలో సంచలనం చేయటం కొందరికి మామూలే. ఏపీలో జగన్ సర్కారుపై ఈ తరహా ప్రచారం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా వైరల్ గా మారిన ఈ ఉదంతం కూడా ఆ కోవకు చెందినదే అని చెబుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ విధానాలు.. అనుసరిస్తున్న పద్దతుల గురించి ప్రచారం చేసుకోవటం కొత్తేం కాదు. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఏపీ సర్కారు ఒక ఒప్పందం చేసుకుంది.

ఏపీ ప్రభుత్వం.. అందులోని నాయకుల ఇమేజ్ పెంచేలా సదరు మీడియా సంస్థలో కథనాలు వచ్చేందుకు వీలుగా రూ.8.15 కోట్ల మొత్తంతో ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక జీవో జారీ చేసింది. అందులో.. జాతీయ స్థాయిలో ఇమేజ్ పెంచుకోవటం అనే విషయాన్ని సూటిగానే చెప్పేశారు తప్పించి.. ఎక్కడా దాచి పెట్టింది లేదు.

ఆ విషయాన్ని అదేదో పెద్ద తప్పు మాదిరి ఎత్తి చూపిస్తూ.. జగన్ సర్కారు ఏదో దారుణానికి పాల్పడినట్లుగా పేర్కొంటూ.. మీడియా సంస్థతో ఒప్పందం చేసుకోవటమా? ఇమేజ్ పెంచేలా కథనాలు రావటానికి కోట్లు ఖర్చు పెడతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించటం.. వేలెత్తి చూపించటం చూస్తే.. గత ప్రభుత్వాల ఒప్పందాల మాటేమిటి? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.

ఒక మీడియా సంస్థతో ఇలాంటి ఒప్పందం చేసుకున్నందుకు కడుపు మంటా? తమకు ఇవ్వలేదన్న అక్కసా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి వెళ్లేలా చేసే ప్రయత్నం తప్పెందుకు అవుతుంది? అన్నది అసలు ప్రశ్న. అయితే.. ఈ తర్కాన్ని వదిలేసి.. బురద జల్లటమే లక్ష్యంగా పెట్టుకున్న తీరు చూస్తే.. జగన్ సర్కారును ఏదోలా బద్నాం చేయాలన్నదే లక్ష్యమన్న భావన కలుగక మానదు.