Begin typing your search above and press return to search.

రేవంత్‌రెడ్డి 'టిక్కెట్ల' ప్లాన్‌ ఏంటి?

By:  Tupaki Desk   |   25 May 2023 8:00 AM GMT
రేవంత్‌రెడ్డి టిక్కెట్ల ప్లాన్‌ ఏంటి?
X
ఢిల్లీ పెద్దలతో పరిచయాలున్నంత మాత్రాన సీట్లు దక్కవని కాంగ్రెస్‌ పెద్దలు అంటున్నారు. ప్రజాబలం ఉన్నవారికే టిక్కెట్టు కేటాయిస్తామని చెబుతున్నారు. ఏ స్థానంలో ఏ అభ్యర్థిని బరిలోకి దింపితే విజయం సాధిస్తారో సీటు వారిదేనని అంటున్నారు. తనతో అందరికీ అదే విధానమని టిపిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తెలిపారు. మరీ అభ్యర్థుల ఎంపికలో రేవంత్‌రెడ్డి ఏం చేయబోతున్నారు.

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ తెలంగాణలోనూ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. గెలిచే అవకాశం ఉన్న ఏ చోటు వదలకూడదని, ఏ నాయకున్ని చేజార్చుకోకూడదని నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ పైరవీలకు తావు లేదని చెబుతున్నారు నేతలు. ఢిల్లీ తెలిసిన పెద్దల ద్వారా టిక్కెట్లు తెచ్చుకోవాలనుకోవడం వారి భ్రమేనని అంటున్నారు.

గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ స్థానంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలో ప్రజా సర్వే నిర్వహిస్తామని తెలిపింది. సర్వేల ఆధారంగా టిక్కెట్లు కేటాయించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర ఇంచార్జి మాణిక్‌ రావు ఠాక్రే తేల్చిచెప్పారు.

ఎంత గొప్ప నాయకుడైనా సర్వే ఆధారంగానే టిక్కెట్టు పొందుతాడని అన్నారు. ఇటూ టిపిసిసి ఛీప్‌ రేవంత్‌రెడ్డి కూడా అదే ప్రకటించారు. తనతో సహా అందరూ సర్వేకు కట్టుబడి ఉండాలని అన్నారు.

అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల నేతలతో కాంగ్రెస్‌ అధిష్టానం చర్చించనుంది. అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గదర్శకాలు సూచించనుంది.

ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కనుగోలు సునీల్‌ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటకలోనూ ఆయన కాంగ్రెస్‌కు వ్యూహాలు రచించారు. రాష్ట్ర పరిస్థితిపై సునిల్‌ బృందం రాహూల్‌ గాంధీకి సమాచారం ఇస్తోంది. ఈ సమాచారం ద్వారా కూడా అధిష్టానం నిర్ణయాలు తీసుకుటుంది.