Begin typing your search above and press return to search.

బీజేపీ విషయంలో పవన్ లేటెస్ట్ స్టాండ్ ఏంటి అంటే....?

By:  Tupaki Desk   |   14 Nov 2022 3:34 PM GMT
బీజేపీ విషయంలో పవన్ లేటెస్ట్ స్టాండ్ ఏంటి అంటే....?
X
బీజేపీ జనసేనకు పొత్తు ఉన్న పార్టీ. కానీ ఆచరణలో మాత్రం రెండు పార్టీలు కలసి అడుగులు వేసిన సందర్భాలు లేవు. అదే టైం లో వైసీపీ మీద పవన్ కళ్యాణ్ ఏపీలో చేసే ఏ ఒక్క పోరాటంలో బీజేపీ నేతలు కనిపించరు. వారి జెండాలు కూడా కనబడవు. అంతా పై పైన పొత్తుల మాదిరిగానే ఉంటారు. ఈ రకమైన చికాకు వ్యవహారం చూసే పవన్ కళ్యాణ్ మీతో కుదరదు సామీ అని తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారు.

అయితే పవన్ కళ్యాణ్ ముందర కాళ్లకు బంధం వేసేందుకా అన్నట్లుగా ఏకంగా ప్రధాని మోడీతోనే భేటీలు వేయించారు. అర్జంటుగా ప్రధానిని కలవాలంటూ ప్రత్యేక విమానం పెట్టి మరీ విశాఖ తీసుకువచ్చారు. ఏకంగా అరగంట పాటు పవన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. దాంతో ఏపీలో బీజేపీ పవన్ని తమ వైపు లాగేసింది అని అనుకున్నారు.

ఇక ఏపీలోని బీజేపీ నేతలు పవన్ తో కలసి భుజం భుజం కలిపి ముందుకు అడుగులు వేస్తారు అని కూడా భావించారు. కానీ ప్రధాని అలా వెళ్లగానే ఇలా ఎవరికి వారుగానే జనసేన బీజేపీ వ్యవహరిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీలను సందర్శించి అక్కడ అక్రమాలను ఎండగట్టడానికి పవన్ వెళ్తే ఆ కార్యక్రమంలో ఒక్కటి అంటే ఒక్క బీజేపీ జెండా కనిపించలేదు. దాంతో ఈ పొత్తు కధేంటి రా బాబూ అని జనాలే అనుకోవాల్సి వచ్చింది.

మరో వైపు చూస్త దీని కంటే ముందు వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా విజయవాడ వంతెన మీద ర్యాలీ చేయాలనుకున్నారు. అలా బీజేపీ జనసేన ప్రకటించిన ఉమ్మడి ప్రోగ్రాం అదే. కానీ అది కూడా జరగలేదు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా పవన్ బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా ర్యాలీలో పాలుపంచుకుని సభలో ప్రసంగించారు.

ఆ తరువాత ఎవరి దారులు వారివి అయ్యాయి. ఇక ఇపుడు చూస్తే మరోసారి మోడీ ద్వారా బీజేపీ పెద్దలు పవన్ని దువ్వుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ విషయంలో ఈ రోజుకీ తొందరపడకూడదు అని భావిస్తున్నారు అంటున్నారు. ఏపీలో వైసీపీ మీద దూకుడుగా పవన్ పోరాడుతున్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ విషయంలో కలసిరావడంలేదు అన్నదే జనసేనలో ఉన్న భావన అని చెబుతున్నారు.

మరో వైపు చూస్తే పవన్ దూకుడు ఆపి ఆయన ముందర కాళ్లకు బంధం వేయడం ద్వారా తాము అనుకున్నది ఏపీ రాజకీయాల్లో చేయాలని బీజేపీ అనుకుంటోంది అని విశ్లేషిస్తున్నారు. దేశంలో ఎక్కడా కనీస బలం కూడా లేకుండా అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఏపీలో కూడా పవన్ చరిష్మాను వాడుకోవాలని, ఆ విధంగా తాము ఎదగాలని భావిస్తోంది అని అంటున్నారు.

అయితే బీజేపీ వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉండడంతో జనసేనలోనే కొత్త ఆలోచనలు చేస్తున్నారుట. ఏపీలో ఏ మాత్రం బలం లేని బీజేపీతో కలసి నడవడం ఎందుకు అని చాలా మంది నేతలు సూచిస్తున్నారుట. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండగా నిలబడి వైసీపీతో పోరటానికి కొత్త శక్తిని ఇస్తుందనుకుంటే ఉన్న శక్తిని లేకుండా చేయాలని చూస్తోందని జనసేనలో అనుమానాలు ఉన్నాయట.

దాంతో బీజేపీ విషయంలో పవన్ తన ఆలోచనలు మార్చుకోవాలని చెబుతున్నారుట. అయితే ప్రస్తుతానికి మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుపోవాలని పవన్ అనుకుంటున్నారు. ఎన్నికలకు దగ్గర చేసి కీలక నిర్ణయమే జనసేన నుంచి వస్తుంది అని అంటున్నారు. అది బీజేపీకి శరాఘాతంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.