Begin typing your search above and press return to search.

మోడీ ఏం తెస్తారు? ఏం ఇస్తారు?

By:  Tupaki Desk   |   30 Jun 2022 6:38 AM GMT
మోడీ ఏం తెస్తారు? ఏం ఇస్తారు?
X
జూలై 4వ తేదీన నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించబోతున్నారు. భీమవరంకు వస్తున్న నరేంద్ర మోడీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి దండేసి దండం పెట్టడమేనా ? లేకపోతే ఏపీకి ఇచ్చేదేమైనా ఉందా అనే విషయమై చర్చలు పెరిగిపోతున్నాయి. అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు భీమవరంకు వస్తున్నారు.

అయితే విగ్రహానికి దండం పెట్టడం కాకుండా ఏపీ ప్రయోజనాలకు సంబంధించి మోడి ఏదైనా ప్రకటించాలని జనాలు కోరుకుంటున్నారు. మోడి ప్రధానమంత్రి అయిన తర్వాత విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదాను తుంగలో తొక్కేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవ్వవాల్సిన ప్రత్యేక రైల్వే జోన్ హామీ అటకెక్కిపోయింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వటం లేదు.

ఇవన్నీ సరిపోదన్నట్లుగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించబోతున్నారు. ఒకవైపు ఏపీ ప్రయోజనాలను ఇంత దారుణంగా దెబ్బకొడుతునే మరోవైపు విగ్రహం ఆవిష్కరణకు రావటంపై జనాల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.

దీనికితోడు కేంద్రప్రభుత్వం ఎలా చెబితే బీజేపీ నాయకులు కూడా అలాగే నడుచుకుంటున్నారు. అందుకనే మోడి సర్కార్ మీదున్న మంటను జనాలు రాష్ట్రంలో జరిగే ఎన్నికలు, ఉపఎన్నికల్లో ఓట్ల ద్వారా చూపిస్తున్నారు.

2019 ఎన్నికల్లో పోటీచేసిన బీజేపీకి ఒక్క సీటులో కూడా డిపాజిట్ రాలేదు. తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా ఎక్కడా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన తిరుపతి లోక్ సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో కూడా డిపాజిట్లు తెచ్చుకోలేకపోయింది. జనాలు పార్టీపై మండిపోతున్న విషయం మోడి దృష్టిలో ఉందో లేదో తెలీదు.

ఒకవైపు రాష్ట్రాన్ని లేవనీయకుండా దెబ్బకొడుతునే మరోవైపు రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవటం లేదంటే ఎలా పుంజుకుంటుంది ? అసలే ఏపీలో పార్టీ పరిస్థితి దశాబ్దాలుగా అంతంత మాత్రంగానే ఉంది. దానికితోడు కేంద్రం నుండి సహాయ నిరాకరణ జరుగుతోంది. ఎలాగూ షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి భీమవరంలో పర్యటించబోతున్న మోడి ప్రజలకు ఏదైనా తీయటి వార్త చెబుతారేమో అని ఎదురు చూస్తున్నారు. మరి మోదీ చివరకు ఏమి చేస్తారో చూడాలి.