Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ఎన్నిక.. కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

By:  Tupaki Desk   |   10 Jun 2022 4:59 AM GMT
రాష్ట్రపతి ఎన్నిక.. కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
X
రాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించిన నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అంటూ వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో కొన్నాళ్లుగా ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎలా వ్యవహరించబోతున్నారు అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్‌ ఎలా ముందుకు వెళతారు? బీజేపీతో తలపడేందుకు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తారు? థర్డ్ ఫ్రంట్ తరఫున అభ్యర్థిని దించుతారా? లేదంటే ప్రతిపక్షాలన్నింటిని తరఫున పోటీకి దిగే ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇస్తారా? అనేవాటిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలో గత వైఖరికి పూర్తిగా భిన్నమైన పంథాను అనుసరించే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. పోయినసారి జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రతిపాదిత అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు కేసీఆర్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మే నెల చివరి వారంలో జరిగిన కేసీఆర్ తన బెంగళూరు పర్యటనలో మాజీ ప్రధానమంత్రి దేవగౌడను కలిశారు. ఈ సందర్భంగా మూడు నెలల్లో దేశ రాజకీయాల్లో సంచలనాలు చూస్తారని మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో తన ప్రయత్నాలను వేగవంతం చేయాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం.

బీజేపీయేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు.. మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), పినరయి విజయన్ (సీపీఎం), నవీన్‌ పట్నాయక్‌ (బిజూ జనతాదళ్), జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (జార్ఖండ్ ముక్తి మోర్చా) లతో కేసీఆర్ గతంలో భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌తోనూ వివిధ సందర్బాల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అలాగే పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలకు నేతలుగా ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎంలు శరద్‌ పవార్, కుమారస్వామి, అఖిలేశ్‌ యాదవ్, బిహార్‌ విపక్ష నేత తేజస్వి యాదవ్‌తో కూడా సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలపడమే లక్ష్యంగా ఈ భేటీల్లో చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో కేసీఆర్‌ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నారని అంటున్నారు. ఈ క్రమంలో మరోమారు బీజేపీయేతర సీఎంలు, పార్టీల అధినేతలు, ఇతర కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ లేదా ఢిల్లీలో ఈ సమావేశం ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా తన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ బృందం కేసీఆర్ కు నివేదికలు అందజేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ కూడా కొత్త పార్టీ పెట్టారు. బిహార్ వేదికగా పనులు కూడా మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో తాజా భేటీలో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం, గెలుపు అవకాశాలు, జాతీయ స్థాయిలో పార్టీలన్నింటితో ఏకాభిప్రాయం సాధించడం తదితర అంశాలపై ప్రశాంత్ కిషోర్ తో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం.