Begin typing your search above and press return to search.

విజయశాంతి ఆంతర్యం ఏంటసలు?

By:  Tupaki Desk   |   9 Nov 2020 5:15 AM GMT
విజయశాంతి ఆంతర్యం ఏంటసలు?
X
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ నేత విజయశాంతి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆమె ప్రకటన సంచలనంగా మారింది. బీజేపీలో విజయశాంతి చేరబోతుందా అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

తాజాగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ సంచలనమైంది. ‘కాంగ్రెస్ నేతల్లో కొందరిని సీఎం కేసీఆర్ ప్రలోభ పెట్టి.. మరికొందరిని భయపెట్టి టీఆర్ఎస్ లోకి తీసుకున్నారని.. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి పార్టీ మార్పించారని’ విజయశాంతి ఆరోపించారు. కాంగ్రెస్ ను బలహీనపరచడం వల్ల ఇప్పుడు తెలంగాణలో బీజేపీ సవాల్ విసిరే స్థాయికి చేరిందని.. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ కు వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జిగా మాణిక్యం ఠాగూర్ మరికొంత ముందుగా రాష్ట్రానికి వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మెరుగ్గా ఉండేవని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పరిస్థితిని కాలం, ప్రజలే నిర్ణయించాలని విజయశాంతి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ లో కొద్దిరోజులుగా విజయశాంతి అసంతృప్తిగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లు విజయశాంతిని ఇంటికి వెళ్లి కలిసి బీజేపీలోకి ఆహ్వానించారన్న ప్రచారం సాగింది. ఆ తర్వాత మాణిక్యం ఠాగూర్ కూడా ఏకాంతంగా విజయశాంతితో మాట్లాడారు. ఈ క్రమంలోనే విజయశాంతి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

విజయశాంతి వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ పని తెలంగాణలో ఖతమైందని.. బీజేపీ మాత్రం టీఆర్ఎస్ కు సవాల్ చేసే స్థితిలో ఉందని అర్థమవుతోంది. మాణిక్యం ఠాగూర్ లేట్ గా స్పందించాడనే అర్థం వచ్చేలా ఆమె కామెంట్ చేశారు. దీంతో విజయశాంతి పార్టీ మార్పు ఖాయమా అన్న ప్రచారం సాగుతోంది. ఈ నెలఖారులోనే విజయశాంతి బీజేపీ చేరబోతోందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.