Begin typing your search above and press return to search.

విపక్షాలు ఓకే అంటే మాత్రం.. బీజేపీ బుద్ది ఏమైపోయినట్లు?

By:  Tupaki Desk   |   19 July 2022 11:30 AM GMT
విపక్షాలు ఓకే అంటే మాత్రం.. బీజేపీ బుద్ది ఏమైపోయినట్లు?
X
ఆదాయమే తప్పించి ప్రజల బాధలు పట్టనట్లుగా తయారయ్యాయి ఇప్పటి ప్రభుత్వాలు. ఏ చిన్న అవకాశం చిక్కినా పన్నుపోటుతో బాదేయటం ఒక అలవాటుగా మారింది. ఒకే దేశం.. ఒకే పన్ను పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ పుణ్యమా అని.. సామాన్యుడి జేబు మీద భారం పడుతోంది. రోజువారీగా వాడే తప్పనిసరి వస్తువులను సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి పన్నుతో బాదేయటంలో మోడీ సర్కారు సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. పాలు.. పెరుగు.. పన్నీర్ లాంటివి ప్యాకేజ్ రూపంలో ఉంటే వాటిపై ఐదు శాతం పన్నుపోటుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

సామాన్యుడికి మండిన మంటను అర్థం చేసుకున్న విపక్షాలు సైతం.. కేంద్రం తీరుపై విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి వేళ.. బీజేపీ నేతలు రియాక్టు అవుతున్నారు.

కొత్తగా మరికొన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం.. మరికొన్నింటిపై ఇప్పటికే ఉన్న పన్ను శ్లాబ్ ను పెంచుతూ నిర్ణయం తీసుకోవటాన్ని తప్పు పడుతున్న విపక్షాలపై ఫైర్ అవుతున్నారు. మీరు.. జీఎస్టీ కౌన్సిల్ లో ఉన్నారు కదా? అప్పుడేమో పన్నుపోటుకు ఓకే చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడతారా? అంటూ కమలనాథులు కస్సు మంటున్నారు.

జీఎస్టీ మండలిలో పన్ను పెంపునకు అనుకూలంగా ఓటేసి.. ఇలా మాట్లాడటం ఏమిటి? అంటూ బీజేపీ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లామ్ ప్రశ్నిస్తున్నారు. తాజాగా పెరిగిన జీఎస్టీపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మండిపడటంపై ఆయన తప్పు పట్టారు. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ గా రాహుల్ అభివర్ణించటాన్ని ఆయన తప్పు పట్టారు.

విపక్షాలపై తప్పు నెట్టేసే ముందు మోడీ సర్కారు.. పన్నులు పెంచితే వచ్చే ఇబ్బంది గురించి ఆలోచించకుండానే ప్రతిపాదనను పెడతారా? విపక్షాల్ని విమర్శించే ముందు.. ఇప్పటికే పన్నుల మోతతో హాహాకారాలు చేస్తున్న ప్రజలకు మరింత మంట పడుతుందన్న కనీస ఆలోచన లేకుండా జీఎస్టీ పెంపు ప్రతిపాదనను ఎలా తీసుకొస్తారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముందు వాటికి సమాధానం చెప్పిన తర్వాత విపక్షాలపై విరుచుకుపడితే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. ఈ వాదనకు బీజేపీ నేతలు ఏమని బదులిస్తారో?