Begin typing your search above and press return to search.

నంబర్ తగ్గింది... వైసీపీలో ఏం జరుగుతోంది....?

By:  Tupaki Desk   |   14 Feb 2023 9:19 AM GMT
నంబర్ తగ్గింది... వైసీపీలో ఏం జరుగుతోంది....?
X
వైసీఎపీ ఇపుడు ఎన్నికల ఫీవర్ ని కోరి తెచ్చుకుంది. ఆ మాటకు వస్తే చాలా కాలం నుంచే ఎన్నిక జ్వరంతో అధినాయకత్వం ఉంది. దాన్ని ఎమ్మెల్యేలకు అంటిస్తోంది. అయితే ఎంతమంది వేడెక్కారో అని ధర్మామీటర్ పట్టుకుని టెస్టులు చేయిస్తోంది. సర్వేలతో కొలుస్తోంది. ఎంత కొలిచినా ఏమి చేసినా సగానికి సగం మందిలో వేడి కనిపించడంలేదని నివేదికలు చెబుతున్నాయి.

అదే టైం లో  పనిచేయని వారికి టికెట్లు ఉండవని జగన్ నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు. ఎవరైనా టికెట్లు కావాలనుకుంటే పనిచేయాల్సిందే అంటున్నారు. గడప గడప కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అని కూడా చెబుతున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు వర్క్ షాప్ పేరిట ఎమ్మెల్యేలకు జగన్ ఇదే విషయం చెప్పారు. వారిలో వేడిని పెంచేలా చర్యలు చేపట్టారు.

ఇక తాజాగా జరిగిన వర్క్ షాప్ లో చూస్తే పనిచేయడం లేదనుకున్నా గడప గడపకు వెళ్లడంలేదనుకున్నా అలాంటి ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై మంది మాత్రమే అని లెక్క తేల్చారు అని చెబుతున్నారు. ఇది నిజంగా కనుక చూస్తే చాలా గొప్ప పరిణామంగానే చూడాలి. ఎందుకంటే గతంలో జరిగిన వర్క్ షాప్స్ లో తీసుకుంటే మొదట 27 మంది ఎమ్మెల్యేల నివేదికలు బాలేదని వచ్చింది. ఆ తరువాత నంబర్ చూస్తే 35కి పై దాటింది.

దాంతో ఈసారి కచ్చితంగా మరో అయిదో పదో యాడ్ అవుతారు అనుకుంటే ఏకంగా 20కి నంబర్ తగ్గింది. దీంతో వైసీపీలో ఎమ్మెల్యేలు అంతా గడప గడపకూ వెళుతున్నారా. బాగా పనిచేస్తున్నారా. అలా చేస్తున్నట్లుగా అధినాయకత్వానికి నివేదికలు వస్తున్నాయా వస్తే వాటిని చూసి హై కమాండ్ సంతృప్తి చెందుతోందా అన్న చర్చ వస్తోంది.

నిజానికి ఇప్పటిదాకా ప్రచారం చూస్తే సగానికి సగం మంది అంటే 70 నుంచి 75 మంది ఎమ్మెల్యేల దాకా టికెట్లు దక్కవని అంతా భావించారు. కానీ లేటెస్ట్ వర్క్ షాప్ చూస్తే 130 మంది పనితీరు బాగున్నట్లే అనుకోవాలి. నాలుగేళ్ల పాలన తరువాత జనంలో బాగా వ్యతిరేకత ఉంది అని  విపక్షాలు చెబుతున్న వేళ అధికార పార్టీలో జస్ట్ ఇరవై మంది మాత్రమే పనితీరు మెరుగుపరచుకోవాలి తప్ప అంతా బాగానే ఉంది అని అధినాయకత్వం నమ్ముతోందా. నిజంగా అలాగే జరుగుతోందా అన్నదే చర్చ.

అదే కనుక జరిగితే మాత్రం వైసీపీ మరోసారి గెలిచేసినట్లే. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సింది లేదు. మరిన్ని వర్క్ షాప్స్ కూడా నిర్వహించాల్సిన అవసరం కూడా పడదేమో. కానీ అలా నిజంగా ఉందా అన్న డౌట్లే వస్తున్నాయి. మరి నంబర్ చూస్తే ఇరవై మందే అని ప్రచారంలోకి వస్తున్న విషయం. దీని మీద కూడా అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి.

గతంలో నంబర్ ఎక్కువ చేసి చూపించడం వల్ల బయట గోల గోల అయింది. వైసీపీ హై కమాండే ఇలా చెబుతోంది ఇక వైసీపీ మీద గ్రౌండ్ లెవెల్ లో అంతకు మించే వ్యతిరేకత ఉందని విపక్షాలు కూడా ఊదరగొట్టాయి. ఇంకో వైపు చూస్తే పనితీరు బాగులేని వారికి టికెట్లు రావు అని కూడా చెప్పడం వల్ల చాలామంది కంగారు పడుతూ పక్క చూపులు చూస్తున్నారు అని అంటున్నారు.

దాంతో ఈసారి నంబర్ తగ్గిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే నిజమైతే మాత్రం వైసీపీ 2024లో ఒడ్డున పడినట్లే అని అన్న వారూ ఉన్నారు. కానీ బయట వాతావరణం చూస్తే అలా లేదు కాబట్టి నంబర్ తగ్గిందన్న దాని మీద మాత్రం రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. మరి ఇరవై మంది మాత్రమే ఉన్నారు. వారు కూడా తమ పనితీరు బాగుచేసుకోవాలని అంటున్నారు. ఇక అందరూ వచ్చే ఎన్నికల్లో గెలవాలని కూడా అధినాయకత్వం కోరుకుంటోంది అంటే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది సిట్టింగులకు కోత పెట్టరా లేక  పెట్టే సాహసం చేయలేకపోతున్నారా అన్నదే ఇపుడు అసలైన చర్చగా ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.