Begin typing your search above and press return to search.

మార్గదర్శి విచారణలో ఏం జరగబోతోంది ?

By:  Tupaki Desk   |   13 April 2023 10:12 AM GMT
మార్గదర్శి విచారణలో ఏం జరగబోతోంది ?
X
ఇపుడీ విషయమే సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. విషయం ఏమిటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మర్ రామోజీరావు, ఎండీ శైలజను గురువారం అమరావతిలో సీఐడీ విచారణ చేయబోతోంది. మొదటి విచారణ హైదరాబాద్ లోని శైలజ ఇంట్లోనే సీఐడీ విచారించిన విషయం తెలిసిందే. రెండో విడత విచారణకు ఇద్దరినీ అమరావతికి రావాల్సిందిగా నోటీసుల్లో సీఐడీ స్పష్టంచేసింది. దాంతో విచారణ పేరుతో సీఐడీ ఇద్దరి పైనా ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా అనే ఆసక్తి పెరిగిపోతోంది.

మార్గదర్శి వివాదం ఇపుడు ఢిల్లీకి చేరుకుంది. సీఐడీ చీఫ్ సంజయ్ ఢిల్లీకి వెళ్ళి ఐటి, ఈడీ, ఆర్ధిక శాఖలోని ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మార్గదర్శి అవినీతి, అక్రమాలకు పాల్పడిందనేందుకు సంజయ్ పూర్తి ఆధారాలను అందించారట. బహుశా ఈ విషయం తెలిసిన తర్వాతే యాజమాన్యం కూడా సీఐడీ కి వ్యతిరేకంగా పెద్ద స్టోరీ రాసుకుంది. అనవసరంగా తనను ప్రభుత్వం వేధిస్తున్నట్లు ఆరోపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో వార్తలు, కథనాలు రాస్తున్నందుకే ప్రభుత్వం తమ పై కక్షసాధింపులకు దిగిందని ప్రత్యారోపణలు చేసింది యాజమాన్యం.

ఇక్కడ గమనించాల్సింది ఏమంటే సీఐడీ లేవనెత్తిన నిధుల మళ్ళింపు, చిట్ ఫండ్ చట్టానికి వ్యతిరేకంగా మార్గదర్శి నిర్వహణ తదితరాల పైన మాత్రం యాజమాన్యం ఎలాంటి సమాధానం చెప్పలేదు. సీఐడీకి సమాధానం చెప్పకుండానే తమ పై వేధింపులంటు పెద్ద బ్యానర్ కథనాన్ని అచ్చేసుకోవటం పై ప్రభుత్వం సహజంగానే మండుతుంది.

ఈ నేపధ్యంలోనే రెండోసారి విచారణలో ఇద్దరి పైనా ఏమైనా సీరియస్ యాక్షన్ ఉంటుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు సోదాలు జరిగింది ఎక్కువగా ఏపీ పరిధిలోని బ్రాంచీల్లోనే కాబట్టి రెండో విచారణను అమరావతిలో చేయాలని సీఐడీ డిసైడ్ చేసింది.

మరిందుకు రామోజీ, శైలజ అంగీకరిస్తారో లేదో తెలీదు. విచారణకు అమరావతిలో హాజరైతే ఏమి జరుగుతుంది ? విచారణకు హాజరుకాకపోతే సీఐడీ ఏమిచేస్తుంది అనేదే ఇపుడు కీలకమైన ప్రశ్న. ఈ నేపధ్యంలోనే సంజయ్ కేంద్ర దర్యాప్తు సంస్ధల్లోని ఉన్నతాధికారులను కలవటం, ఆధారాలను అందించటంతోనే సీన్ ఢిల్లీకి కూడా మారిందా అనే అనుమానం పెరిగిపోతోంది. మరి ఏమవతుందో చూడాల్సిందే.