Begin typing your search above and press return to search.

కార్డియాక్ అరెస్టు అంటే ఏమిటి? అదెందుకు వస్తుంది?

By:  Tupaki Desk   |   30 Oct 2021 4:02 AM GMT
కార్డియాక్ అరెస్టు అంటే ఏమిటి? అదెందుకు వస్తుంది?
X
మనం అంతా ఇంతా అని అనుకుంటాం కానీ.. అదేమీ నిజం కాదు. జీవితం క్షణభంగురం అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది తాజాగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ మరణం. అప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండి..అంతలోనే ప్రాణాలు విడిచేంత పరిస్థితికి కారణమేంటి? అదెలా సాధ్యం ? అన్న ప్రశ్నకు వైద్యులు చెప్పే సమాధానం.. ‘‘కార్డియాక్ అరెస్టు’’. అంతే ఏమిటి? అంటే.. మన ప్రాణానికి మూలాధారమైన గుండె అకస్మాత్తుగా కొట్టుకోవటం ఆగిపోవటం.

అప్పటివరకు రోడ్డు మీద వెళుతున్న బండిని ఒక్కసారి సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? ప్రాణాల్ని నిలిపే గుండె ఒక్కసారిగా ఆగితే.. మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాణాంతకమైన గుండె సంబంధిత వ్యాధి ఎందుకు వస్తుందన్న ప్రశ్నకు వైద్యులు చాలానే సమాధానాలు చెబుతుంటారు.
అమెరికాలో ఈ సమస్య తో సగానికి పైగా జనాభా ఇబ్బంది పడుతుంటారు. అయితే.. కార్డియాక్ అరెస్టుకు గురైన వెంటనే వైద్యం అందితే.. ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందని చెబుతారు. ఇంతకీ కార్డియాక్ అరెస్టు లక్షణాలు ఏమిటి? ఎవరు దీని బారిన పడతారు? చికిత్స ఏ విధంగా తీసుకోవాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. పలువురు ఆరోగ్య నిపుణులు.. వైద్యులు అందిస్తున్న సమాచారం ఏమంటే..

కార్డియాక్ అరెస్టుకు కారణం ఏమిటి?

అర్థమయ్యే భాషలో ఈ కఠినమైన విషయాన్ని సింఫుల్ గా చెప్పాలంటే.. గుప్పెడంత ఉండే మన గుండెలో మొత్తం నాలుగు గదులు ఉంటాయి. కింద ఉండే రెండు గదులను జఠిరికలు అని.. పైన ఉండే రెండు గదులను కర్ణికలు అని అంటారు. అరుదైన సందర్భాల్లో గుండె లయ తప్పటం వల్ల జఠిరిక రక్తప్రసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగుతుంది. ఇది కూడా ఆకస్మిక గుండె మరణానికి కారణమవుతుంది.
సాధారణంగా వెంట్రిక్యూలర్ ఫైబ్రిలేషన్ కారణంగా కార్డియాక్ అరెస్టు సంభవిస్తుందని చెబుతారు. కొన్నిసార్లు పైన ఉండే గదుల్లోని అరిథ్మియా వల్ల గుండె కొట్టుకోవటం ఆగుతుంది. సినోట్రియల్ నోడ్ సరైన విద్యుత్ ప్రేరేపణలను పంపనప్పుడు కర్ణికల్లో దడ మొదలవుతుంది. ఫలితంగా జఠరికలు శరీరానికి అవసరమైన రక్తాన్ని పంప్ చేయవు. దీంతో ప్రాణాల మీదకు వస్తుంది.

ఇంతకీ ఈ కార్డియాక్ అరెస్టు ముప్పు ఎవరిలో ఎక్కువగా ఉంటుందన్నది మరో ప్రశ్న. దీనికి వైద్య నిపుణులు చెప్పే సమాధానం ఏమంటే.. కరోనరీ హార్ట్ సమస్యలతో బాధ పడే వారిలో ఈ సమస్య ఉంటుంది. గుండె పరిణామం పెద్దదిగా ఉన్న వారిలో హఠాత్తుగా గుండె ఆగే ప్రమాదం ఉంది. పుట్టుకతోనే గుండె జబ్బు ఉన్న పిల్లల్లోనూ ఆకస్మిక కార్డియాక్ అరెస్టు సంభవించే వీలుంది. గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్యలు కారణంగానూ ఇలాంటి పరిస్థితి ఏర్పడి మరణానికి దారి తీయొచ్చు.

ఈ ముప్పు మన జోలికి ఎందుకు వస్తుంది? అన్న ప్రశ్నను వేసుకుంటే.. సిగిరెట్ తాగటం.. ఒకేచోట ఎక్కువగా కూర్చొని పని చేసే అలవాటు.. అధిక రక్తపోటు.. ఊబకాయం.. వంశపారంపర్య గుండె జబ్బులు.. 45 కంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులకు.. 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు.. పోటాషియం.. మెగ్నీషియం స్థాయిలో తక్కువ ఉన్నా.. ఈ సమస్య వచ్చి పడుతుంది.

కార్డియాక్ అరెస్టు సమస్య వచ్చిందన్న విషయాన్ని ఎలా గుర్తించాలంటే.. దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దీని ప్రకారం తల తిరగటం.. అలసటగా అనిపించటం.. వాంతి.. గండుల్లో దడ.. ఛాతీ నొప్పి.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది.. స్పృహ కోల్పోవడం లాంటివి చోటు చేసుకున్న వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళితే..ప్రాణ ముప్పును తగ్గించే వీలుంది. కార్డియోగ్రామ్ పరీక్ష చేసి.. శరీరానికి రక్తం ప్రసరించేలా చేసి ప్రాణాల్ని రక్షిస్తుంటారు వైద్యులు.