Begin typing your search above and press return to search.

బీజేపీ గేమ్ ప్లాన్‌... ఏపీలో టీడీపీ భూస్థాపిత‌మేనా?

By:  Tupaki Desk   |   18 Jun 2019 2:30 PM GMT
బీజేపీ గేమ్ ప్లాన్‌... ఏపీలో టీడీపీ భూస్థాపిత‌మేనా?
X
తాజా ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీకి ద‌క్కిన ఓట‌మి... ఆ పార్టీకి గ‌ట్టి దెబ్బేన‌ని చెప్పాలి. ఎందుకంటే... 37 ఏళ్ల ప్ర‌స్థానం ఉన్న ఆ పార్టీకి తాజా ఎన్నిక‌ల్లో దక్కినంత ఘోర ప‌రాజ‌యం ఎన్న‌డూ ద‌క్క‌లేదు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్ల‌లో పోటీ చేసిన టీడీపీ... కేవ‌లం 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్ల‌లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. నాలుగు జిల్లాల్లో అసలు ఖాతానే తెర‌వలేక‌పోయింది. చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో చంద్ర‌బాబు మిన‌హా ఒక్క‌రంటే ఒక్క‌రూ గెల‌వ‌లేదు. మొత్తంగా ఈ ఓట‌మి టీడీపీకి గ‌ట్టి దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌టి గ‌ట్టి దెబ్బ‌ను టీడీపీ ఏనాడూ రుచి చూసి ఉండ‌ద‌న్న వాద‌న కూడా నిజ‌మే.

అయితే తాజా ఎన్నిక‌ల్లో త‌గిలిన ఈ గ‌ట్టి దెబ్బ కంటే కూడా మ‌రింత గ‌ట్టి దెబ్బ‌కు ఆ పార్టీ సిద్ధం కావాల్సిందేన‌ట‌. ఓట‌మి బాధ‌లో ఉన్నా కూడా టీడీపీకి మ‌రో భారీ దెబ్బ త‌ప్ప‌దంటున్నారు క‌మ‌ల‌నాథులు. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకుని మ‌రీ సాగిన బీజేపీ... తాజా ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగింది. అయితే ఒక్క సీటునూ గెల‌వ‌లేక‌పోయినా... టీడీపీని మాత్ర భారీగానే దెబ్బ కొట్టింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. స‌రే... ఎన్నిక‌లు ఎలాగూ ముగిశాయి క‌దా. మ‌రి ఇప్పుడు టీడీపీకి త‌గిలే దెబ్బేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఓడిన టీడీపీలోని చాలా మంది కీల‌క నేత‌లు త‌మ పార్టీలో చేర‌బోతున్నారంటూ బీజేపీ నేత‌లు చాలా కాలం నుంచే చెప్పుకుంటూ వ‌స్తున్నారు. అదే మాట‌ను మ‌రోమారు ప్ర‌స్తావించిన బీజేపీ ఏపీ శాఖ‌కు చెందిన కీల‌క నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి... టీడీపీలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు స‌హా చాలా మంది నేత‌లు త‌మ‌కు ట‌చ్ లో ఉన్నార‌ని చెప్పుకొచ్చారు.

తాజా ఎన్నిక‌ల్లో టీడీపీకి త‌గిలిన దెబ్బ కంటే కూడా మ‌రింత గ‌ట్టిగా దెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని, ఆ దెబ్బ కు టీడీపీ సిద్ధ‌మైపోవాల్సిందేన‌ని ఆయ న వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే టీడీపీ ఏపీలో భూస్థాపితం అయిపోతుంద‌ని కూడా విష్ణు జోస్యం చెప్పారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో దాదాపుగా క‌నుమ‌రుగైన టీడీపీ... తాజా ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌ర్వాత ఏపీలోనూ బాగా బ‌ల‌హీన‌ప‌డిపోయింద‌న్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీలో ఉంటే భ‌విష్య‌త్తు లేద‌ని గ్రహించిన చాలా మంది టీడీపీ నేత‌లు త‌మ పార్టీ వైపు చూస్తున్నార‌ని, అయితే ఎవ‌రిని చేర్చుకోవాలి? ఎప్పుడు చేర్చుకోవాలి? అన్న దిశ‌గా త‌మ పార్టీ యోచిస్తోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌మ క‌స‌ర‌త్తు పూర్తి కాగానే టీడీపీ భూస్థాపితం అయిపోవ‌డం ఖాయ‌మేన‌ని ఆయ‌న చెప్పారు. ఇకపై రాష్ట్రంలో అధికార వైసీపీకి ప్ర‌త్యామ్నాయం తామేన‌ని కూడా విష్ణు చెప్పుకొచ్చారు.