Begin typing your search above and press return to search.

అక్కడ పెను సవాల్ : అవంతి ఏం చేయబోతున్నారు...?

By:  Tupaki Desk   |   1 Jun 2022 2:30 AM GMT
అక్కడ పెను సవాల్ : అవంతి ఏం చేయబోతున్నారు...?
X
ఆయన మంత్రిగా మూడేళ్ళ పాటు ఉమ్మడి విశాఖ జిల్లాకు పనిచేశారు. మంత్రి అయితే ఆ అధికారం వేరు, దర్జా వేరు. దాంతో కధ సాఫీగా సాగిపోయింది. ఆయనే అవంతి శ్రీనివాసరావు. ఇపుడు మాజీ మంత్రి అయ్యారు. ఆ వెంటనే పార్టీ బాధ్యతలు అప్పగించారు. విశాఖ జిల్లా విభజన తరువాత ఆరు అసెంబ్లీ సీట్లతో చిన్నదైంది. అయితే ఈ ఆరింటిలో నాలుగు తెలుగుదేశం గెలిచిన సీట్లు, మిగిలిన గాజువాక, భీమిలీ సీట్లు కూడా టీడీపీకి గట్టి పట్టున్నవే.

మరి విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ అంటే టఫ్ జాబ్ గానే చూడాలి. అవంతి శ్రీనివాసరావు రాత్రీ పగలూ ఈ రెండేళ్ళూ గట్టిగా పనిచేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో కానీ మాజీ మంత్రి ప్రమాణం స్వీకారం చేశాక పార్టీ విషయంలో పెద్దగా పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. ఆరు నియోజకవర్గాలలో ఉన్న పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను క్యాడర్ ని కూర్చోబెట్టి దిశా నిర్దేశం చేయాల్సిన అవంతి ఎందుకో అపుడే అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు.

అదే సమయంలో ఆయన తన నియోజకవర్గం భీమిలీలో తిరుగుతున్నారు. తన వరకూ మాత్రమే తాను చూసుకుంటున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ పాలన మూడేళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఏపీలో వైసీపీ క్యాడర్ అన్ని చోట్లా కార్యక్రమాలు నిర్వహిస్తే విశాఖ జిల్లా ప్రెసిడెంట్ అవంతి ఆద్వర్యంలో మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవని అంటున్నారు. ఇక ఇంచార్జులు, పార్టీ నాయకులు ఎక్కడివారు అక్కడ తమకు తోచిన తీరున మూడేళ్ళ వేడుకను నిర్వహించి మమ అనిపించేశారు.

ఇక అవంతి అయితే ఏకంగా హైదరాబాద్ వెళ్ళి పార్టీ రీజనల్ కోరార్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిని కలసి పుష్పగుచ్చం ఇచ్చి పండుగ‌ అయింది అనిపించారు అంటున్నారు. మూడేళ్ళ వేడుక గల్లీలో నిర్వహించకుండా మాజీ మంత్రి గారు వైవీ సుబ్బారెడ్డిని కలిస్తే లాభమేంటి అన్నదే ఇపుడు పార్టీలో చర్చగా ఉంది.

అయితే వైవీని మంచి చేసుకుని తన రాజకీయ జీవితాన్ని, భవిష్యత్తును చూసుకునేందుకు మాత్రమే అవంతి ఇలా చేశారని అంటున్నారు. మరి విశాఖ జిల్లాలో పార్టీ విషయం ఏంటి అన్నది పట్టదా అంటే అవంతి సారే జవాబు చెప్పాలని అంటున్నారు. ఆయన ఉంటే భీఎమిలీ లేకపోతే తన ఇంట్లో ఇంకా కాకపోతే హైదరాబాద్ లో ఉంటున్నారు తప్పించి పార్టీని విశాఖలో పటిష్టం చేసేందుకు సరైన కార్యాచరణ రూపొందించడంలేదని అంటున్నారు.

అవంతికి జిల్లా ప్రెసిడెంట్ పదవి ఇష్టం లేదా లేక ఆయన మంత్రి పదవి పోయింది అన్న బాధలోనే ఇంకా ఉన్నారా అన్న చర్చ కూడా వస్తోంది. అదే టైమ్ లో అవంతి జిల్లా ప్రెసిడెంట్ గా అంటే ఇతర నాయకులు సహకరించడంలేదా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా మంత్రిగా పనిచేసిన వారు బలమైన సామాజికవర్గానికి చెందిన నాయకుడు, అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న నాయకుడు అని భావించే అధినాయకత్వం అవంతికి ఈ పదవి ఇచ్చిందని అంటున్నారు.

కానీ ఆయన విశాఖ జిల్లాలో నాయకులను కలుపుకుని పోవడంలో మాత్రం విఫలం అవుతున్నారా అన్నదే ప్రశ్నగా ఉంది. లేక మంత్రిగా ఆయన ఉన్నపుడు పోయిన ఒంటెద్దు పోకడల వల్లనే ఇపుడు నాయకులు ఆయనకు దూరం జరుగుతున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా విశాఖ జిల్లా టీడీపీకి కంచుకోట. మరి అక్కడ రిపేర్లు చేయాల్సిన మాజీ మంత్రి గారు ఇంకా పని మొదలెట్టలేదు అనే అంటున్నారు అంతా.