ఆరేళ్లకు పైనే మోడీ సర్కారు అధికారంలో ఉన్నా.. ఏ రోజున ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడు ఎదురవుతోంది. అన్నదాత కడుపు మండితే సీన్ ఎలా ఉంటుందో దేశ రాజధాని ఢిల్లీని చూస్తే అర్థం కాక మానదు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టంపై వ్యతిరేకతతో కదం తొక్కిన రైతుల్ని బుజ్జగించే పని చేయటంలో కేంద్ర సర్కారు అనుసరిస్తున్న విధానాలు ఆందోళనను మరింత పెంచేలా చేస్తున్నాయే తప్పించి.. తగ్గించే ప్రయత్నం చేయట్లేదు. దీనికి తోడు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తలబిరుసుతనం కూడా రైతుల్లోఆగ్రహాన్ని మరింత పెంచుతోంది.
తాము తీసుకొచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకునేది లేదని..కావాలంటే.. చట్టాన్ని మరింత వివరంగా వివరిస్తామని చెబుతున్న మాటలు.. రైతుల్ని కన్వీన్స్ చేసే కన్నా కూడా కోపం కట్టలు తెగేలా చేస్తుందంటున్నారు. సాధారణంగా ఏదైనా ఆందోళన అన్నప్పుడు ఒకట్రెండు రోజులు నిరసన చేసి వెళ్లిపోతారు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు రైతులు. ట్రాక్టర్లు.. ట్రాలీల్లో నిత్యవసర వస్తువుల్ని తెచ్చుకొని రోడ్ల మీద బైఠాయిస్తున్నారు. దీంతో.. ఢిల్లీలోని ఏ మూలన చూసినా రైతులే కనిపిస్తున్నారు. వీరిలో ఎక్కువగా పంజాబ్ రైతులే ఉండటం గమనార్హం.
అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనతో కేంద్ర సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అవసరమైతే.. జనవరి 26 వరకు తాము ఆందోళన చేసేందుకు వీలుగా వంటసామాగ్రితో రంగంలోకి దిగిన రైతుల దెబ్బకు.. కేంద్రానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆందోళన చేస్తున్న రైతుల్లో ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కావటంతో.. కేంద్రం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీకి వచ్చే ఐదు ప్రధాన రహదారుల్ని మూసేశారు.
రైతుల ఆందోళన కారణంగా ఢిల్లీకి చేరే రహదారుల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతోంది. రైతుల్ని అడ్డుకునేందుకు బ్యారికేడ్లు.. ఇనుప కంచెలు మాత్రమే కాదు.. సిమెంటు దిమ్మలు కూడా తాత్కాలికంగా నిర్మిస్తున్నారు. అయినా.. అన్నదాతలు వాటిని లెక్క చేయకుండా ముందుకెళుతున్న వైనంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇదిలా ఉంటే..ఇప్పటికే పంజాబ్.. హర్యానా ముఖ్యమంత్రుల మధ్య ఘర్షణ జరగ్గా.. తాజాగా పంజాబ్ సీఎం.. ఢిల్లీ ముఖ్యమంత్రి మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది.
బీజేపీ చెప్పినట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నడుచుకుంటున్నారని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించగా.. ఢిల్లీ స్టేడియాలను రైతుల ప్రదర్శనలకు అనుమతి ఇవ్వనందుకే.. ఇలా మాట్లాడుతున్నారని.. అమరీందర్ ఇంతలా దిగజారి మాట్లాడతారని తాను అనుకోలేదని.. కేజ్రీవాల్ వెల్లడించారు. మొత్తంగా ఇప్పుడు పరిస్థితి అయితే.. కేంద్రానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పదు.