Begin typing your search above and press return to search.

డోపింగ్ టెస్టులకు దొరక్కుంటీ టీమిండియా క్రికెటర్లు తీసుకుంటున్న ఆ ఇంజెక్షన్లు ఏంటి?

By:  Tupaki Desk   |   15 Feb 2023 11:00 AM GMT
డోపింగ్ టెస్టులకు దొరక్కుంటీ టీమిండియా క్రికెటర్లు తీసుకుంటున్న ఆ ఇంజెక్షన్లు ఏంటి?
X
టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పెద్ద దుమారమే రేపారు. జీ న్యూస్ స్టింగ్ ఆపరేషన్‌లో ఆయన భారత క్రికెట్ జట్టుకు సంబంధించి చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ముఖ్యంగా జట్టులోకి ఎంపికయ్యేందుకు ఫిట్‌నెస్ చూపించుకోవడాని అగ్ర ఆటగాళ్లు సహా అనేక మంది ఏవో ఇంజెక్షన్లు వాడుతున్నారని, బీసీసీఐ డాక్టర్లే కాకుండా ఆటగాళ్లు వ్యక్తిగతంగా వైద్యులను నియమించుకుంటున్నారని.. వారే ఈ ఇంజక్షన్లు ఇస్తున్నారని చేతన్ శర్మ చెప్పారు.

బుమ్రా ప్రస్తుతం కిందకు వంగలేని పరిస్థితుల్లో ఉన్నాడని... మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ప్రైవేటుగా ఇంజక్షన్లు తీసుకుని ఫిట్ నెస్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారని చేతన్ శర్మ చెప్పారు. అయితే, ఇవి పెయిన్ కిల్లర్లు కావని... పెయిన్ కిల్లర్లు అయితే డోపింగ్ టెస్టులో దొరికిపోతారని చేతన్ శర్మ చెప్పారు. కానీ, భారత క్రికెటర్లు తీసుకుంటున్న ఈ ఇంజక్షన్లు డోపింగ్ టెస్టుల్లో కూడా దొరకవని చెప్పారు చేతన్ శర్మ.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటి విషయాలనూ చేతన్ శర్మ చెప్పారు. కోహ్లీ ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పారని... ఆయన కెప్టెన్సీకి రాజీనామా చేస్తానని చెప్పగానే అలాంటి నిర్ణయం వద్దని, ఆలోచించుకోమని గంగూలీ చెప్పారని.. కానీ, కోహ్లీ మాత్రం గంగూలీ తనతో మాట్లాడలేదని ఆరోపించారని చేతన్ శర్మ అన్నారు.

టీమ్ ఇండియాకు మూలస్తంభాల్లా భావించే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి కూడా చేతన్ శర్మ కీలక విషయాలు బయటపెట్టారు. ఈ ఇద్దరూ టీ20 జట్టు నుంచి నిష్క్రమించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు చేతన్ శర్మ. టీ20 కెప్టెన్సీ హార్దిక్ పాండ్యా చేతికి పూర్తిగా అప్పగించి శుభమన్ గిల్‌ను బాగా ఎంకరేజ్ చేయబోతున్నారని చేతన్ శర్మ చెప్పారు.

ఇక సౌరబ్ గంగూలీకి కోహ్లీ అంటే ఏమాత్రం నచ్చదని కూడా చేతన్ శర్మ అన్నారు. రోహిత్ శర్మ అన్నా గంగూలకీ ఇష్టమేమీ లేదని అయితే కోహ్లీ అంటే మాత్రం ఆయనకు ఇష్టం ఉండదని చెప్పారు.
టీమ్ ఇండియాలో రెండు వర్గాలున్నాయని... ఒకటి కోహ్లీ వర్గం కాగా ఇంకోటి రోహిత్ శర్మ వర్గమని చేతన్ శర్మ చెప్పారు. కోచ్ ద్రవిడ్, కోహ్లీ మధ్య సంబంధాలు ఎలా ఉన్నయనేదీ శర్మ చెప్పుకొచ్చారు.

కాగా చేతన్ శర్మ చెప్పిన ఈ విషయాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జట్టుకు సంబంధించిన రహస్యాలు బయటకు పొక్కడంపై బీసీసీఐ చేతన్ శర్మపై వేటు వేసే అవకాశాలున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.