Begin typing your search above and press return to search.

నవంబరు 3న కాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆలస్యమైతే?

By:  Tupaki Desk   |   1 Aug 2020 11:30 PM GMT
నవంబరు 3న కాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆలస్యమైతే?
X
ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో అధ్యక్ష ఎన్నికల విధానం చాలా సంక్లిష్టంగా ఉండటమే కాదు.. వివిధ దశల్లో ఉంటుంది. దీనికి తోడు.. ఎన్నికలకు సంబంధించి పక్కా ప్లానింగ్ మాత్రమే కాదు.. అధ్యక్ష స్థానాల్లో ఉన్న వారు తమ పదవీ కాలం ముగుస్తుంటే చాలు.. ప్రొసీజర్ ను పక్కాగా ఫాలో అవుతుంటారు. చాలా దేశాల్లో లేని ఒక విధానం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. ఏ అధ్యక్షుడైనా.. ఎంతటి ప్రజాదరణ ఉన్నా.. రెండుసార్లకు మించి బరిలో నిలిచే అవకాశం లేదు. గెలిస్తే.. రెండుసార్లు మాత్రమే అధ్యక్ష స్థానంలో నిలువగలుగుతారు.

అనూహ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో విశేషమైన అధికారాన్నిపరిమితమైన కాలానికే ఉంచటం అమెరికా ప్రత్యేకతగా చెప్పాలి. అప్పుడెప్పుడో 1788లో తొలిసారి ఎన్నికలు జరిగిన తర్వాత.. ఇప్పటివరకూ ఆ సిస్టంను ఇంతవరకు బ్రేక్ చేసినోళ్లు లేరు. ఎవరికి వారు తమ పదవీకాలం ముగిసిన వెంటనే వెనక్కి వెళ్లిపోవటం మినహా చేసిందేమీ లేదు. అయితే.. ఇందుకు భిన్నంగా ఎన్నికల్ని వాయిదా వేయాలనుకోవటం.. ఏదో ఒక కొర్రీలు పెట్టటం లాంటి వాటికి ట్రంప్ ట్రై చేస్తున్నారన్న భావన మొన్న ఆయన పెట్టిన ట్వీట్ లో ధ్వనిస్తోంది.

ఇలాంటివేళ.. కొత్త సందేహాలు కలుగుతున్నాయి. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వారెవరూ ఎన్నికల్ని ఆలస్యం చేసే అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే.. అధ్యక్షుల వారి చేతుల్లోనూ ఏమీ ఉండదన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఎన్నికలు ఆలస్యమైన పక్షంలో ఏం జరుగుతుంది? రూల్ బుక్ ఏమని హెచ్చరిస్తోంది? దాని కారణంగా చోటు చేసుకునే పరిణామాలు ఏమై ఉంటాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

రూల్ బుక్ ప్రకారం అధ్యక్ష ఎన్నికల్ని ఆలస్యం చేయటం.. రద్దు చేసే అధికారం దేశాధ్యక్షుల వారికి ఉండదు. ఒకవేళ.. ఈ రూల్ ను సవరించి.. దాన్ని నెగ్గించుకునే సత్తా ఉందా? అంటే రిపబ్లికన్లకు అంత సీన్ లేదు. వాస్తవానికి సెనేట్ లో రిపబ్లికన్లకు బలం ఉన్నప్పటికీ.. ట్రంప్ ప్రతిపాదన పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన ఎదురుగా ఉన్న ఈ ప్రతికూలతల్ని తనకున్న టాలెంట్ తో మేనేజ్ చేశారే అనుకుందాం. అప్పుడేం జరుగుతుందన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర పరిణామాలకు తెర తీసినట్లవుతుంది.

ఎందుకంటే.. అమెరికా రాజ్యాంగం 20వ సవరణ ప్రకారం జనవరి 20 మధ్యాహ్నానానికి ఉపాధ్యక్షులుగా ఉన్న వారి పదవీ కాలం ముగుస్తుంది. దీంతో.. ఉపాధ్యక్షుల వారితో కలిసి గూఢపుఠాణి చేసినా.. ఆయనకు కలిగే ప్రయోజనం ఉండదు. దీంతో.. అధ్యక్షుల వారు తీసుకునే దరిద్రపుగొట్టు నిర్ణయాలకు ఆయన ఓకే చెప్పటం సాధ్యం కాదు. ట్రంప్ లాంటోడు ఏమైనా చేయగలడన్న నమ్మకం కొందరిలో ఉంది కాబట్టి.. ఉపాధ్యక్షుల వారి పదవీ కాలం పూర్తి అయిన తర్వాత..చోటు చేసుకునే పరిణామాలు క్లిష్టంగా ఉంటాయి. అందుకే.. ఎవరూ కూడా అధ్యక్ష ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుకోరు. ట్రంప్ ను నెత్తిన మోసే రిపబ్లికన్లు సైతం ఎన్నికల వాయిదా విషయానికి మాత్రం తమ నేతకు వ్యతిరేకంగానే ఉండటం గమనార్హం.