Begin typing your search above and press return to search.

కేసీఆర్ చెప్పిన మాటను గూగుల్ లో వెతికితే ఏం వస్తుంది?

By:  Tupaki Desk   |   5 July 2021 2:30 PM GMT
కేసీఆర్ చెప్పిన మాటను గూగుల్ లో వెతికితే ఏం వస్తుంది?
X
అందంగా.. ఆకర్షణీయంగా.. వినసొంపుగా మాటలు చెప్పే వారితో సమస్య ఏమంటే.. వారు చెప్పే అర్థ సత్యాలు సత్యాలుగా.. వారి నోటి నుంచి అనుకోని రీతిలో వచ్చిన మాటలన్ని వాస్తవాలుగా నమ్మేస్తారు. తర్వాత ఎవరైనా.. బాబు నువ్వు విన్నది తప్పు అని చెబితే.. అలా అన్నోడి మీద గయ్యిమంటారు. మాటలకున్న పవర్ అలాంటిది. అలాంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి మాటల మనిషి.. విషయం ఏదైనా సరే అరటిపండు వొలిచినట్లుగా చెప్పటమే కాదు.. తాను చెప్పేవన్ని కఠిన నిజాలుగా ఆయన నమ్మించే తీరుకు ఎవరైనా ప్రభావితం కావాల్సిందే. ఆయనకు మూడ్ బాగుండి రివ్యూ సమావేశాలు పెట్టినప్పుడు.. కనీసం ఆరేడు గంటలకు తగ్గకుండా సాగుతాయి. ఆ సందర్భంగా ఆయనే ఎక్కువగా మాట్లాడతారని చెబుతారు.

ఇంతకీ ఆయన మాటల్ని వినే భాగ్యం దక్కేది.. ఆలిండియా సర్వీసుల్లో ఎంపికైన సీనియర్ ఐఏఎస్ అధికారులు. మరి.. వారికి విషయాలు తెలీవా? కేసీఆర్ చెప్పే మాటలు వారికి బోర్ కొట్టవా? అన్న సందేహం కలిగి.. ఇదే క్వశ్చన్ ను పలువురు అధికారుల వద్ద ప్రస్తావించినప్పుడు వారిచ్చే సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘నిజమే.. తెలిసిన విషయాలు కేసీఆర్ నోటి నుంచి వింటున్నప్పుడు సరికొత్తగా ఉంటుంది. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమంటే.. విషయాల్ని విషయాలుగా కాకుండా.. తన అబ్జర్వేషన్ ను కూడా కలుపుతారు. దీంతో మరింత ఆసక్తికరంగా ఉంటుంది. గంటల కొద్దీ మాట్లాడుతుంటే వినటం కష్టం. కానీ.. కేసీఆర్ మాటలు బోర్ కొట్టించవు’’ అని చెబుతారు. మరో అధికారి ఇంకో కీలకమైన విషయాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ కున్న విలక్షణత ఏమంటే.. తాను సమర్థించిన విషయానికి సంబంధించిన వాదన మొత్తం తప్పే అయినా.. వేలెత్తి చూపించటానికి వీల్లేని విధంగా ఆయన ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తారని చెప్పారు.

తాజాగా శ్రీశైలం ప్రాజెక్టు ఎపిసోడ్ ను చూస్తే ఇదే విషయం ఇట్టే అర్థమవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు గురించి తాజాగా వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ‘‘ఆ ప్రాజెక్టును కట్టిందే జల విద్యుత్తు కోసం. 1959లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులోని నీటిని ఇతర అవసరాలకు మళ్లించటానికి వీల్లేదని స్పష్టం చేసింది’’ అంటూ వాదన వినిపించారు. ఈ మాటల్ని విన్నంతనే.. అమ్మ.. ఆంధ్రాబడవల్లారా? ఎంత దారుణమైన ప్లాన్ వేశార్రా? అన్న కోపం రాక మానదు. అయితే.. కేసీఆర్ మాటల్ని పూర్తిగా నమ్మకుండా.. అదే సమయంలో ఆంధ్రా వారి మాటల్ని పట్టించుకోకుండా అంతో ఇంతో సాపేక్ష సమాచారాన్ని అందించే గూగులమ్మను బాగా వెతికేసే పని చేస్తే ఏం జరుగుతుంది?

నిజమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలో అర్థ సత్యముంది. మొదట్లో దీన్ని జలవిద్యుత్ కోసం స్టార్ట్ చేశారు. ఈ మాట విన్నంతనే.. కేసీఆర్ చెబితే రైట్ అని సంబరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ మాట పక్కనే మరో కీలకమైన అంశాన్ని గూగులమ్మ చెప్పింది. అదేమంటే.. ప్రాజెక్టు అనుకున్నట్లుగా ముందుకు సాగకపోవటం.. తర్వాతి కాలంలో వచ్చిన అవసరాల నేపథ్యంలో దాన్ని బహుళార్థక సాధక ప్రాజెక్టుగా మార్చారు. గూగులమ్మను ఎందుకు నమ్మాలనుకుంటే.. ఇక్కడే మరో విషయాన్ని గుర్తు చేయాలి. చిన్నప్పుడు.. అంటే ఐదారు తరగతుల్లో ప్రాజెక్టుల గురించి పాఠాలు చదివే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థక సాథక ప్రాజెక్టు అన్న పదం రావటం.. దాని అర్థాన్ని టీచరమ్మలు చెప్పే విషయాన్ని గుర్తు చేసుకుంటే.. కేసీఆర్ వాదనలో వాస్తవం ఇట్టే బోధ పడిపోతుంది.

అయినప్పటికి కేసీఆర్ మాటల్నే నమ్ముతాం కానీ గూగులమ్మను.. టెస్టు పుస్తకాల్ని నమ్మనంటే నమ్మమని మొండికేసే వాళ్లకు మరో విషయాన్ని కూడా చెప్పాల్సిన ఉంటుంది. తన గొప్పతనంగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతి ఆ పేరు మీద లేదు కదా? దాన్ని మొదట్లో అంబేడ్కర్ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుగా ఏర్పాటు చేశారు. మొదట్లో అనుకున్నది16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.38,500 కోట్లు నిర్మాణ వ్యయం అనుకున్నాం.

మరి.. దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చేయటంతో పాటు.. 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించారు. దీని నిర్మాణ వ్యయాన్ని రూ.80వేల కోట్లకు పెంచారు. మరి.. అలాంటప్పుడు మొదట అనుమతి పొందిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి పేరు మార్చేసిన కాళేశ్వరంగా తన ముద్ర వేసుకున్నప్పుడు లేని తప్పు.. శ్రీశైలం ప్రాజెక్టులో జరిగిన దాని గురించి.. అదో పెద్ద నేరంగా అభివర్ణిస్తున్న తీరును చూస్తే.. కేసీఆర్ మాటల తీరుకు ఏం తెలివి అనుకోకుండా ఉండలేం. ఇలా తనకు తగ్గట్లుగా వాదనల్ని నిర్మించుకునే కేసీఆర్ మాటల్ని నమ్మాల్సిన అవసరం ఉంటుందా? అన్ని ప్రశ్న.