Begin typing your search above and press return to search.

ట్రంప్ వైట్ హౌస్ ను వీడటానికి నిరాకరిస్తే ఏంజరుగుతుంది !

By:  Tupaki Desk   |   11 Nov 2020 7:30 AM GMT
ట్రంప్ వైట్ హౌస్ ను వీడటానికి నిరాకరిస్తే ఏంజరుగుతుంది !
X
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠతల మధ్య అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపు సాధించాడు. త్వరలో అతను అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. కానీ ఇప్పటికీ డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఏదో మ్యాజిక్ జరుగుతుంది అని ఆశిస్తున్నాడట. తను గెలిచే అవకాశాలు ఇంకా ఉన్నాయి అని..ఓడిపోలేదు అని.. అందుకే వైట్ హౌజ్ ఖాళీ చేసేది లేదు అని మొండిపట్టుపట్టాడట ట్రంప్. అయితే , 244 ఏళ్ల అమెరికా చరిత్రలో ఎన్నికల్లో ఓడిన తర్వాత వైట్ హౌజ్‌ను వదిలి వెళ్లేందుకు అధ్యక్షులు నిరాకరించిన సందర్భం ఏ రోజు లేదు. కానీ ట్రంప్ తాజాగా తన ఓటమిని అంగీకరించడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాడు. దీనితో ట్రంప్ వైట్ హౌస్ ను వీడకపోతే ఏంజరుగుతుంది అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది.

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ప్రక్రియలపై ఆయన కోర్టుల్లో దావాలు ఇంకా వేస్తారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షడి పదవి కాలం జనవరి 20 మధ్యాహ్నంతో ముగిసిపోతుందని అమెరికా రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. ఇక తాజా ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో అవసరమైన మెజార్టీ జో బైడెన్ సాధించారు. రాబోయే నాలుగేళ్లు అధ్యక్షుడిగా ఉండేందుకు ఆయనకు హక్కు ఉంది. అయితే, ఎన్నికల ఫలితాలను సవాలు చేసేందుకు న్యాయపరమైన, చట్టపరమైన అవకాశాలు కొన్ని ట్రంప్ ముందు ఉన్నాయి. కానీ, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆయన చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవు. ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ అధికారాన్ని బైడెన్‌కు అప్పగించేందుకు నిరాకరిస్తే, ఏం జరుగుతుందా అనేది చాలామందిలో మెదిలే ప్రశ్న.

దీనిపై జో బైడెన్ ఇదివరకే ఓ టీవీ ఇంటర్యూలో మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత ‘ట్రంప్ వైట్ హౌజ్‌ను ఖాళీ చేసి వెళ్లేందుకు నిరాకరిస్తే పరిస్థితి ఏంటన్నది ఆలోచించారా అని అడగ్గా .. అవును. ఆలోచించాను. అలాంటి పరిస్థితి వస్తే, సైన్యం ఆయన్ను వైట్ హౌజ్ నుంచి పంపించేస్తుందని భావిస్తున్నా అని బైడెన్ అన్నారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ కూడా ఇలా ట్రంప్‌ను వైట్ హౌజ్‌ నుంచి బయటకు తీసుకువెళ్లవచ్చని భావిస్తున్నారు.అధ్యక్షుడి భద్రత బాధ్యత సీక్రెట్ సర్వీస్‌ దే. మాజీ అధ్యక్షులకు కూడా ఈ విభాగం భద్రత అందిస్తుంది. ఇటు బైడెన్ విజయం ఖాయం అవ్వగానే సీక్రెట్ సర్వీస్ ఆయనకు భద్రతను పెంచింది. అధ్యక్షుడికి కల్పించే స్థాయిలోనే భద్రత కల్పిస్తోంది.

వివాదాస్పద ఎన్నికల్లో ట్రంప్ గెలిచినట్లుగా పరిగణించాలని సూచిస్తూ కార్యనిర్వాహక వ్యవస్థకు ట్రంప్ అధ్యక్ష హోదాలో ఉత్తర్వు ఇవ్వొచ్చు. న్యాయ శాఖలోని తన రాజకీయ మిత్రుల ద్వారా కూడా ఇలాంటి ఆదేశం ఇవ్వొచ్చు. కానీ, ఇదో తీవ్ర అనుచిత చర్య అవుతుంది. తన పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ట్రంప్ తనకే సెల్యూట్ చేయాలని అనడం సైన్యాన్ని ఇబ్బందికర పరిస్థితిలో పెట్టొచ్చు అని ప్రొఫెసర్ డకోటా రడెసి అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి ఓటమిని అంగీకరించకుంటే, పౌర వ్యవస్థ గాడి తప్పే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ కీషా బ్లెయిన్ అన్నారు. ట్రంప్ వాదన నిరసనలకు, హింసకు తావు తీసేలానే ఉందని అభిప్రాయపడ్డారు.