Begin typing your search above and press return to search.

విశాఖకు ఏమైంది...వరసబెట్టి మరీ...?

By:  Tupaki Desk   |   4 Oct 2022 12:30 AM GMT
విశాఖకు ఏమైంది...వరసబెట్టి మరీ...?
X
విశాఖను రాజధాని నగరంగా పాలకులు ప్రొజెక్ట్ చేస్తున్నారు. విశాఖను అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ అంటున్నారు. విశాఖ రెడీ మేడ్ రాజధాని, అక్కడ ప్రగతి ఫలాలు ఏపీ అంతా పంచి రాష్ట్రాన్ని అగ్రగామి చేసుకుందామని వైసీపీ మంత్రులు తరచూ చెబుతూ ఉంటారు. అయితే విశాఖ సిటీలో చూస్తే గత కొంతకాలంగా సీన్ ఎలా ఉంది అంటే దారుణం అన్న మాట చెప్పాలేమో అంటున్నారు జనాలు.

విశాఖలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతోందా అన్న అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి. విశాఖ ఒకప్పుడు ప్రశాంత నగరం. కానీ నేడు అదే విశాఖలో మర్డర్స్ డెడ్ ఈజీగా జరిగిపోతున్నాయి. ఇటీవల నెలల తేడాలో అరడజన్ మర్డర్స్ విశాఖ సిటీలో జరిగాయి. వీటికి వివిధ కారణాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కానీ మర్డర్ చేయాలన్న ఆలోచన ఎందుకు వస్తోంది. అంత ధైర్యం ఎలా వచ్చింది అన్నదే జనం మాటగా ఉంది.

లేటెస్ట్ గా చూస్తే సోమవారం తెల్లవారుతూనే ఏడున్నర పదులు వయసు ఉన్న ఒక వృద్ధుడిని అందరూ చూస్తూండగానే ఒక ఇరవై మూడేళ్ళ యువకుడు పిడి గుద్దులు గుద్ది మరీ చంపేశాడు. ఇది విశాఖ నడిబొడ్డునే జరిగింది. తన ఆటోకు ముందు పెట్టిన బైక్ తీయమని ఆ వృద్ధుడు అడగడమే తప్పు అయిపోయింది. ఇక బాగా తాగి ఉన్న ఆ యువకుడు ఈ విధంగా పిడిగుద్దులతో వృద్ధుడిని హతమార్చడంతో విశాఖ నివ్వెరపోతోంది.

దీనికి ముందు ఒక బార్ లో కొందరు రౌడీ గ్యాంగ్ పూటుగా తాగి బయటకు వచ్చి ఒకరిని రోడ్డు మీదనే కత్తులతో పొడిచి చంపిన ఘటన కూడా విశాఖ నడిబొడ్డునే పట్ట పగలే రద్దీగా ఉన్న చోటనే జరిగింది. ఇక విశాఖతో పాటు చుట్టుపక్కన ఉన్న గాజువాక, పెందుర్తిలో వరసబెట్టి హత్యలు ఈ మధ్యకాలంలో జరిగాయి. దీంతో విశాఖ జనం బెంబేలెత్తుతున్నారు.

విశాఖలో భూకబ్జాలు బాగా పెరిగాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటుగా రౌడీ షీటర్ల వీరంగం కూడా ఎక్కువ అయిపోయింది అని అంటున్నారు. మరి వారి వెనక ఉన్న దర్జా, పలుకుబడి ఏంటో తెలియదు కానీ వీరవిహారం చేస్తున్నారు అని చెబుతున్నారు. పోలీసులు కొందరు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చామని చెబుతున్నా కూడా ఎవరూ దారికి వచ్చిన దాఖలాలు అయితే కనిపించలేదు. మొత్తానికి వృద్ధుడిని దారుణంగా చంపడం అంటే విశాఖ ఉలిక్కిపడుతోంది.

ఇపుడే ఇలా ఉంటే రేపటి రోజున రాజధాని పేరిట మరింత రద్దీ పెరిగితే ఆ ట్రాఫిక్ నుంచి మరెంతమంది రౌడీలు పుట్టుకువస్తారో అని భీతిల్లుతున్నారు. పోలీసులు అలెర్ట్ గా ఉన్నమని చెబుతున్నా భయాలు అయితే నేర‌స్థులలో లేకుండా పోతున్నాయి అని అంటున్నారు. చిన్నపాటి విషయాలకే కత్తులు కటార్లు తీసి రౌడీ గ్యాన్స్ విశాఖలో చేస్తున్న వీరంగానికి అడ్డుకట్ట వేయకపోతే ప్రశాంత నగరం మీద వేరే ముద్ర పడి మొత్తం పేరు ప్రతిష్టలు కూడా మసకబారే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. ఇక విశాఖలో ఇపుడిపుడే పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్న వేళ రౌడీ మూకల దాష్టికాలను నిలువరించకపోతే విశాఖ ప్రగతికే అతి పెద్ద అడ్డుగోడ పడుతుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.