Begin typing your search above and press return to search.

ఫెడరల్ ఫ్రంట్ ముచ్చట ఏమైందయ్యా కేసీఆర్ ... నమ్మకం కోల్పోయిన మమత !

By:  Tupaki Desk   |   22 Dec 2020 7:00 AM GMT
ఫెడరల్ ఫ్రంట్ ముచ్చట ఏమైందయ్యా కేసీఆర్ ... నమ్మకం కోల్పోయిన మమత !
X
తెలంగాణ రాజకీయం లో వచ్చే రోజుల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్టు జరిగే పరిణామాలని చూస్తే అర్థమౌతుంది. ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పలేని పరిస్థితి. ఇక బీజేపీ దుబ్బాక , గ్రేటర్ లో సత్తా చాటి టిఆర్ ఎస్ కి సరైన ప్రత్యామ్న్యాయం మేమే అని ప్రచారం చేసే పనిలో బిజీగా ఉంది. దీనితో సీఎం కేసీఆర్ కూడా తన బుర్రకి పదును పెడుతున్నాడు. రెండేళ్ల క్రితం కొత్త రాజకీయ శక్తి ఫెడరల్ ఫ్రంట్ కోసం శ్రమించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. తాజాగా సొంత రాష్ట్రంలోకి బీజేపీ దూసుకొస్తున్న నేపథ్యంలో కేసీఆర్ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక్క వేదికపైకి తీసుకొచ్చి హైదరాబాదులో సమావేశం నిర్వహించాలని భావించారు. డిసెంబర్ రెండో వారంలో ఈ భేటీ ఉంటుందని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలు, రైతు చట్టాలపై చర్చిస్తామని చెప్పారు. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ ఐ సీ, ఎయిరిండియా, బొగ్గు గనులు వంటివి ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మోడీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్.

అయితే, గ్రేటర్ లో టీఆర్ ఎస్ పార్టీ ఊహించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చకపోవడంతో సీఎం కేసీఆర్ వెనుకడుగు వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి స్నేహపూర్వకమైన వాతావరణంలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఆ సమయంలో రైతు సమస్యలను ప్రస్తావించలేదని సమాచారం . ఇక ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన సీఎం కేసీఆర్... బీజేపీ వ్యతిరేక శక్తులతో హైదరాబాదులో ఓ సమావేశం నిర్వహిస్తామన్న మాటను ఎక్కడా కూడా మాట్లాడలేదు. అలాగే, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై మోడీ, అమిత్ షా లాంటి వారు నిప్పులు చెరుగుతుంటే ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులు మమతకు అండగా నిలిచారు కానీ సీఎం కేసీఆర్ మాత్రం మద్దతుగా నిలవలేదు. ఇదే విషయాన్ని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ట్వీట్ చేశారు.

బెంగాల్ ‌లో ఐపీఎస్ బదిలీల అంశంలో మమతకు అండగా నిలిచిన డీఎంకే అధినేత స్టాలిన్, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, భూపేష్ భగల్, అశోక్ గెహ్లాట్ ‌లకు మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలిపారని ఫెడరల్ ఫ్రంట్ చీఫ్ సీఎం కేసీఆర్ ఈ జాబితాలో ఎందుకు లేరని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. దిలా ఉంటే త్వరలోనే మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులతో కోల్ ‌కతాలో సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదని సమాచారం. అయితే సీఎం కేసీఆర్‌ ను ఎందుకు ఆహ్వానించలేదో కూడా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. అదే సమయంలో బీజేపీ మరియు టీఆర్ ఎస్ ‌లు రెండు రహస్య ఒప్పందంపై పయనిస్తూ ప్రజలను పిచ్చివారిని చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మొత్తంగా తెలంగాణ రాజకీయాలని ఒకసారి నిశితంగా పరిశీలిస్తే త్వరలోనే మార్పులు చెందే అవకాశం ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.