Begin typing your search above and press return to search.

ఏపీకి ఏమైంది? కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

By:  Tupaki Desk   |   14 Feb 2021 5:00 AM GMT
ఏపీకి ఏమైంది? కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
X
గడిచిన కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి ఏపీలోని విశాఖ జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాద షాక్ నుంచి కోలుకోక ముందే.. ఈ తెల్లవారుజామున (ఆదివారం) కర్నూలు జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవదర్శనానికి వెళుతున్న వారు.. ప్రమాదానికి గురై.. ఘటనాస్థలంలోనే 14 మంది మృత్యువాత పడటం షాకింగ్ గా మారింది.

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద టెంపో వాహనం అదుపు తప్పి డివైడర్ ను దాటి.. అవతలి వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొంది. ఈ ఉదంతంలో టెంపలో ప్రయాణిస్తున్న పద్నాలుగు మంది అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో ఎనిమిది మంది మహిళలు..ఐదుగురు పురుషులు.. ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో బయపడినా.. వారు ఆ షాక్ నుంచి బయటకు రాలేదు.

ప్రమాదం జరిగిన వెంటనే.. లారీ డ్రైవర్ పెద్దగా అరుస్తూ.. సాయం చేయాలని కోరాడు. దీంతో స్పందించిన స్థానికులు అతడికి సాయంగా నిలిచారు. పోలీసులకు సమాచారం అందించారు. లారీని ఢీ కొన్న టెంపో.. తుక్కుతుక్కుగా మారింది. అందులో ఇరుక్కుపోయిన మృతదేహాల్ని బయటకు తీసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. 108 సిబ్బందితో పాటు.. అగ్నిమాపక శాఖ ఫైరింజన్లు చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 18 మంది ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు.

గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో మరో ఇద్దరు (కాశీం.. ముస్తాక్) పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వారి వయసు 10.. 12గా చెబుతున్నారు. లారీని వేగంగా ఢీ కొనటంతో టెంపో నుజ్జు నుజ్జుఅయ్యింది. డెడ్ బాడీస్ బయటకు తీసేందుకు.. క్రేన్ ను సాయంగా తీసుకొచ్చారు. బాధితులు చిత్తూరు జిల్లా మదనపల్లికి సంబంధించిన వారిగా చెబుతున్నారు. వారంతా అజ్మీర్ కు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. టెంపోలో లభించిన ఫోన్ నెంబర్లు.. ఆధార్ నెంబర్ల ద్వారా బాధితుల సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టెంపో డ్రైవర్ మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగిందా? టైరు పగిలిందా? అన్నది తేలాల్సి ఉంది. అప్పుడే ఘోర ప్రమాదానికి అసలు కారణం తేలుతుంది.