Begin typing your search above and press return to search.

‘దిశ’ ఎన్ కౌంటర్ కు ముందు రవి గెస్టు హౌస్ ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   30 Sep 2021 5:33 AM GMT
‘దిశ’ ఎన్ కౌంటర్ కు ముందు రవి గెస్టు హౌస్ ఏం జరిగింది?
X
దేశ వ్యాప్తంగా పెనుసంచలనంగా మారిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి విచారణను కమిషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను విచారించిన కమిషన్ తాజాగా నార్సింగి - శంకర్ పల్లి మార్గంలోని రవి గెస్ట్ హౌస్ నిర్వాహకుల్ని విచారణ జరిపారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు ముందు.. వారిని చర్లపల్లి జైలు నుంచి రవి గెస్టు హౌస్ కు తీసుకొచ్చారు. అందులో ఉంచారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ లో భాగంగా నిందితుల్ని తీసుకొచ్చి.. కొంత సమయం గెస్టు హౌస్ లోనే ఉంచారు.

దీంతో రవి గెస్టు హౌస్ నిర్వాహకుల్ని కమిషన్ విచారణకు పిలిచింది. కమిషన్ తరఫు న్యాయవాది విరూపాక్ష గౌడ్.. గెస్ట్ హౌస్ మేనేజర్ అనిల్ కుమార్.. సెక్యురిటీ గార్డు వెంకటేశ్వర్లను పలు ప్రశ్నలు సంధించారు. అప్పట్లో షాద్ నగర్ లో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న సురేందర్ గెస్ట్ హౌస్ కావాలని అడిగినట్లు చెప్పారు. 2019 డిసెంబరు 3 - 6 వరకు గెస్టు హౌస్ ను లీజుకు తీసుకున్నారని.. రోజుకు రూ.వెయ్యి చొప్పున డబ్బులు ఇచ్చినట్లు చెప్పారు.

అనంతరం హత్యాచార నిందితుల్ని చర్లపల్లి జైలు నుంచి పోలీస్ కస్టడీకి తీసుకొని గెస్టు హౌస్ కు తీసుకెళ్లేందుకు వినియోగించిన వాహన డ్రైవర్ ను కూడా విచారణ జరిపారు. సదరు డ్రైవర్ హోం గార్డుగా పని చేస్తున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి ఐదో తేదీ రాత్రి 11.30 గంటలకు బయలుదేరి.. రవి గెస్ట్ హౌస్ కు 12.15 గంటల వేళకు చేరుకున్నట్లు చెప్పారు.

అక్కడ ఏసీసీ సురేందర్ ను కలిసినట్లు చెప్పారు. తెల్లవారుజాము ప్రాంతంలో చటాన్ పల్లికి వెళ్లాల్సిన అవసరం ఉన్నందున రెస్టు తీసుకోవాలని తనకు సూచన చేశారన్నారు. అనుకున్నట్లే తెల్లవారుజామున పోలీసు సిబ్బందితోపాటు నిందితులనూ తన వాహనంలోనే తీసుకు వెళ్లినట్లుగా చెప్పారు. విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే.. దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ ఉదంతం పోలీసులకు ఇబ్బందికరంగా మారుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.