Begin typing your search above and press return to search.

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏమైంది ?

By:  Tupaki Desk   |   10 March 2021 6:30 AM GMT
జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏమైంది ?
X
ఎవరైనా కౌన్సిలర్ అయిన తర్వాత ఛైర్మన్ సీటుపై గురిపెడతారు. తర్వాత ఎంఎల్ఏ, మంత్రి లేదా ఎంపి స్ధానంపై టార్గెట్ పెడతారు. అంతేకానీ ఎంఎల్ఏ అయిన తర్వాత మళ్ళీ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తారా ? చేస్తారు తాడిపత్రిలో. అవును అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటిలో ఈ విచిత్ర రాజకీయం నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోయారు. అయితే తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో 24వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తానని అప్పట్లోనే ప్రకటించారు లేండి. అయితే అప్పటి ఆయన ప్రకటనను ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇపుడు నామినేషన్ వేసి ప్రచారం చేస్తుండటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి గెలుపు విషయంలో బాగా సీరియస్ గా నే ఉన్నట్లు అర్ధమవుతోంది.

ఈయన పోటీ చేస్తున్నారు సరే మరి జనాలు ఓట్లేస్తారా ? ఎందుకంటే ఎంఎల్ఏగా పోటీ చేసినపుడే ఓట్లేయని జనాలు ఇపుడు కౌన్సిలర్ గా మాత్రం ఎందుకు ఓట్లేస్తారు ? తనకు ఓట్లేయకపోతే ప్రభాకర్ రెడ్డి ఊరుకుంటారా ? అందుకనే వైసీపీ తరపున ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి కొడుకు కూడా ఏదో వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. కాబట్టి తన కొడుకు విజయం కోసం తిరుగుతున్న ఎంఎల్ఏ పనిలో పనిగా మిగిలిన కౌన్సిలర్ల గెలుపు కోసం కూడా ప్రచారం చేస్తున్నారు.

మున్సిపాలిటిలో ఎంఎల్ఏ విస్తృతంగా ప్రచారానికి దిగటమే ప్రభాకర్ రెడ్డికి ఇబ్బందిగా తయారైనట్లు సమాచారం. గెలుస్తారో లేదో తెలీదు కానీ ప్రచారంలో సోమవారం ప్రభాకర్ రెడ్డి కంటనీరు పెట్టుకున్నారు. తాడిపత్రిలో ఏదో జరిగిపోతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏమి జరుగుతోందో చెప్పమంటే మాత్రం మాట్లాడటం లేదు. మొత్తం మీద పార్టీ ఘోర ఓటమితో పాటు జేసీ సోదరుల ఓటమి ప్రభావం ప్రభాకర్ రెడ్డి మీద గట్టిగానే పడినట్లే అనుమానంగా ఉంది.