Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు ఏమైంది? బ్యాడ్ సండే.. రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు

By:  Tupaki Desk   |   13 Dec 2020 4:30 AM GMT
హైదరాబాద్ కు ఏమైంది? బ్యాడ్ సండే.. రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు
X
హైదరాబాద్ మహా నగరానికి ఏమైంది? ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మితిమీరిన వేగంతో పాటు..అప్రమత్తతతో డ్రైవింగ్ చేయాల్సిన విషయంలో జరుగుతున్న తప్పులు.. ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మిగిలిన ఆదివారాలకు భిన్నంగా.. ఈ సండే హైదరాబాదీలకు ఏ మాత్రం బాగోలేదని చెప్పాలి. ఈ రోజు తెల్లవారుజామున రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

ఈ రెండు ప్రమాదాల్లో పలువురు మరణించటం గమనార్హం. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ.. కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మరణిస్తే.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో వైద్యం చేస్తుండగా మరణించినట్లుగా తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ప్రమాదంలో మరణించిన నలుగురు యువకులు పాతికేళ్ల లోపు వారే కావటం గమనార్హం.

ఈ ప్రమాదం షాక్ నుంచి తేరుకోక ముందే.. ఈ ఉదయం మరో ప్రమాదం కుకట్ పల్లిలో చోటుచేసుకుంది. ఈ ఉదయం పిల్లర్ నెంబరు ఎ-836 వద్ద టూవీలర్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రకాశ్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించారు. వేగమే ఈ ప్రమాదానికికూడా కారణమని చెబుతున్నారు. రెండు ప్రమాదాలు ఆదివారం ఉదయం వేళలోనే చోటు చేసుకోవటం చూస్తే.. ఇది కచ్ఛితంగా బ్యాడ్ సండేగా చెప్పక తప్పదు.