Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ కు ఏమైంది? ఆయన పెద్ద మనసు ప్రీతి ఎపిసోడ్ లో చిన్నది కావడమేంది?

By:  Tupaki Desk   |   27 Feb 2023 10:31 AM GMT
సీఎం కేసీఆర్ కు ఏమైంది? ఆయన పెద్ద మనసు ప్రీతి ఎపిసోడ్ లో చిన్నది కావడమేంది?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమైంది? అనూహ్య నిర్ణయాలతో రాజకీయ ప్రత్యర్థులకు.. విపక్షనేతలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని రీతిలో నిర్ణయాలు తీసుకునే ఆయన.. ఇటీవల కాలంలో తప్పులు ఎందుకు చేస్తున్నారు? వేలెత్తి చూపించే అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు? ఎంత జాతీయ పార్టీ అధినేత అయితే మాత్రం.. రాష్ట్రాన్ని.. రాష్ట్రంలో చోటు చేసుకునే పరిణామాల విషయంలో ఇలాంటి తీరును ప్రదర్శించటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే వేళ.. పరిహారం కోసం గొంతెత్తి అడిగే అవకాశం ఇవ్వకుండా.. మారు మాట్లాడని రీతిలో ఆయన ప్రకటన చేయటం.. అందరిని విస్మయానికి గురి చేయటం తెలిసిందే. గతంలో ఏదైనా విషాద ఘటన జరిగినప్పుడు పరిహారం మీద జరిగే రభస చాలా ఎక్కువగా ఉండేది. అలాంటి అవకాశం లేకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా పెను విషాదం చోటు చేసుకుంటే.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేసే ప్రకటన సాంత్వన కలిగేలా చేసేది.

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నంపై కేసీఆర్ సర్కారు స్పందించిన తీరు ఏ మాత్రం సరిగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివారంరాత్రి ఆమె మరణించినట్లుగా ఆమెకు వైద్యం చేస్తున్న నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించటంపై ఒకింత విస్మయం వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతానికి భారీగా పరిహారాన్ని ప్రకటిస్తారని భావించారు.

నిజానికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తమను మరింత బాధకు గురి చేసినట్లుగా బంజారా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా పీజీ వైద్య విద్యార్థిని ప్రాణాల్ని తీశారని.. ఇలాంటి దుర్మార్గ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాగోలేదన్న మాట వినిపించింది. ఆసక్తి కరమైన విషయం ఏమంటే.. ప్రీతి మరణంపై తన సంతాపాన్ని వ్యక్తం చేసిన జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన తరఫు నుంచి రూ.20లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

దొడ్డ మనసుకు కేరాఫ్ అడ్రస్ అయిన కేసీఆర్ నుంచి రూ.10లక్షల పరిహారం రావటం ఏమిటి? జిల్లా మంత్రి తన తరఫున రూ.20 లక్షల పరిహారం.. తాను చూసే పంచాయితీ రాజ్ శాఖలో ప్రీతి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెద్ద మనసుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రీతి మరణం వేళ.. ఆయన మనసు చిన్నది కావటం ఏమిటన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.