Begin typing your search above and press return to search.

మీడియా ఇలా చేసిందేంటి... వైసీపీలో సీనియ‌ర్ల గుస‌గుస‌లు...!

By:  Tupaki Desk   |   11 Nov 2021 7:30 AM GMT
మీడియా ఇలా చేసిందేంటి... వైసీపీలో సీనియ‌ర్ల గుస‌గుస‌లు...!
X
ఇప్పుడు ఎక్క‌డ‌ ఏం జ‌రిగినా.. నిముషాల్లో ప్ర‌జ‌లకుఅందించే సాధ‌నం మీడియా. ప్ర‌భుత్వ ప‌రంగా ఏం చేసినా.. ప్ర‌జ‌ల్లో ఎలాంటి భావం ఉన్నా.. మీడియా ద్వారానే ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి చేరుతున్న ప‌రిస్థితి నేడు స‌ర్వ‌త్రా క‌నిపిస్తోంది. అయితే.. ఒక విష‌యంలో తాజాగా మీడియా నిర్వ‌హించిన పాత్ర‌పై..అధికార పార్టీ వైసీపీలోనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు కీల‌క స‌ల‌హాదారు ఒకాయ‌నికి ఫోన్ల‌మీద ఫోన్లు వ‌స్తున్నాయ‌ట‌. దీనికి కార‌ణం చెప్పేముందు.. ఒక‌సారి.. ఏం జ‌రిగిందో చూద్దాం. ఏదైనా విష‌యంపై ముఖ్య‌మంత్రిస్థాయిలో నిర్ణ‌యం తీసుకుంటే.. దానిపై ప్ర‌ధాన మీడియా స‌హా.. అన్ని ప‌త్రిక‌లు, చానెళ్లు ప్ర‌సారం చేస్తాయి.

అదే సీఎం.. రాజ‌కీయాల‌కు అతీతంగా.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం.. అడుగులు వేస్తే.. ముందుగా స్పందించేది మీడియానే. గ‌తంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఇలా ఏ నిర్ణ‌యం తీసుకుని అడుగులు వేసినా.. మీడియా ముందుగానే ఆయ‌న‌కు కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చేది. అక్క‌డ అలా జ‌రుగుతోంది. ఇక్క‌డ ఇలా ఉంది.. అంటూ.. కొన్ని సూచ‌నాత్మ‌క క‌థ‌నాలు.. వార్త‌లు.. ఆధారాల‌తో స‌హా వివ‌రించేవి. అంతేకాదు.. ఈ విష‌యంలో ఇలా చేస్తే.. స‌మ‌స్య‌తొంద‌ర‌గా ప‌రిష్కారం అవుతుంది.. అంటూ.. కొన్ని సూచ‌న‌లు కూడా చేసేవి.

ముఖ్యంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆల్మ‌ట్టి డ్యాం ఎత్తు పెంచుతున్న స‌మ‌యంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబుకు మీడియానే దిశానిర్దేశం చేసింద‌ని అంటారు. అదేవిధంగా అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఎంపిక చేయ‌డంలోనూ కొన్ని మీడియా సంస్థ‌ల దిశానిర్దేశం ఉంద‌ని చెబుతారు. అయితే.. ఇప్పుడు అలాంటి మీడియా.. సీఎం జ‌గ‌న్‌.. కొన్ని ద‌శాబ్దాలుగా ఎలాంటి ప‌రిష్కారం లేకుండా ఉన్న స‌మ‌స్య‌ను భుజాన వేసుకుని పొరుగు రాష్ట్రంతో చ‌ర్చ‌ల‌కు వెళ్తే.. ఈ మీడియా పూర్తిగా సైలెంట్ అయిపోయింది.

ఒడిశాతో ఏపీకి దాదాపు 60 ఏళ్ల నుంచి ప‌రిష్కారం కాని జంఝావ‌తి, వంశ‌ధార‌, కొఠియా గ్రామాల స‌మ‌స్య ఉంది. దీనిని ప‌రిష్క‌రించుకునేందుకు ఏ ముఖ్యమంత్రి.. కూడా ముందుకు రాలేదు. అలాంటి స‌మ‌స్య‌ను చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకునేందుకు జ‌గ‌న్ ఒక చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌య‌మే తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఒడిశాకు వెళ్లారు. అయితే.. ఘ‌న‌త వ‌హించిన మీడియా ఈ విష‌యాన్ని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. క‌నీసం.. ఇక్క‌డ ఏయే స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఏ విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రిపితే మంచిది. ఎలా ప‌రిష్క‌రించుకుంటే..మ‌న‌కు మేలు జ‌రుగుతుంది? అనే విష‌యాల‌పై క‌నీసం వార్త‌లు ఇవ్వ‌లేక పోయాయి.

అంతేకాదు.. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను కూడా త‌గ్గించి చూపే ప్ర‌య‌త్నం చేశాయ‌న్న‌ది.. వైసీపీ నేత‌ల మాట‌. ఈ క్ర‌మంలోనే.. ``ఏంటి సార్ ఇది.. మీడియా ఇలా చేసింది. ఇంత చ‌రిత్రాత్మ‌క విష‌యాన్ని క‌నీసం ప‌ట్టించుకోలేదు`` అని కీల‌క స‌ల‌హాదారుకు నాయ‌కులు ఫోన్ల‌పై ఫోన్లు చేశారు. దీనికి ఆయ‌న కూడా ఏమో.. అదే నేను కూడా ఆలోచిస్తున్నా.. స‌మ‌యం రానీ.. ఉతికేద్దాం..! అని స‌మాధానం ఇచ్చార‌ట‌. ఇదీ.. సంగ‌తి! అంతేకాదు.. చంద్ర‌బాబు క‌నుక ఇదే ప్ర‌య‌త్నం చేసి ఉంటే.. వేరేగా ఉండేద‌ని.. స‌ద‌రు మీడియా సంస్థ‌లు ఆయ‌న‌ను ఆకాశానికి ఎత్తేసేవ‌ని కూడా అన‌డం కొస‌మెరుపు..