Begin typing your search above and press return to search.

ఆ 18 నిమిషాల్లో పెద్దల సభలో ఏమైంది?

By:  Tupaki Desk   |   21 Sep 2020 9:50 AM GMT
ఆ 18 నిమిషాల్లో పెద్దల సభలో ఏమైంది?
X
రాజకీయాల్లో తల పండిన వారు.. ప్రముఖులు.. వివిధ రంగాల్లో నిపుణులు.. ఇలా చెప్పుకుంటూ పోతే లోక్ సభతో పోలిస్తే.. రాజ్యసభకు ఒక ప్రత్యేక ఛరిష్మా ఉంటుంది. పెద్దల సభగా గౌరవంగా చెప్పుకునే రాజ్యసభలో ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఇంకేమాత్రం రాజ్యసభను పెద్దల సభగా పిలిచేందుకు ఇష్టపడని వైనం కనిపించక మానదు. మూర్తీభవించిన మొండితనంతో అధికారపక్షం.. అందుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో విపక్ష నేతలు వ్యవహరించి.. మొత్తంగా రాజ్యసభకు ఉండే పెద్దరికాన్ని చిన్నబుచ్చేలా చేశారు.

మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు 2020’.. ‘ది ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ బిల్లు 2020’ లను ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పలకటం తెలిసిందే. ఈ బిల్లుల్ని ఆదివారం రాజ్యసభలో చర్చకు తీసుకొచ్చారు. వివాదాస్పద బిల్లులుగా విపక్షాలు అభివర్ణిస్తున్న దీనిపై సుదీర్ఘంగా చర్చ సాగాల్సిన స్థానంలో.. చర్చ కంటే రచ్చకే అధికార.. విపక్షాలు ప్రాధాన్యత ఇచ్చాయని చెప్పక తప్పదు.

ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదం పొందేలా చేసే తొందరను అధికారపక్షం ప్రదర్శిస్తే.. తమ అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్న అధికారపక్షంపై ఆగ్రహంతో ప్రతిపక్షాలు రాజ్యసభలో వేసిన వీరంగం అంతా ఇంతా కాదు. వెల్ లోకి దూసుకెళ్లే చర్యతో పాటు.. అధికారులు కూర్చునే స్థానాల్లో ఏర్పాటు చేసే బల్లల మీద ఎక్కే ప్రయత్నం చేయటంతో పాటు.. టేబుల్ మీద ఉన్న మైకుల్ని విరిచేయటం.. కాగితాల్ని చించేయటం.. నిబంధనల పుస్తకాన్ని విసిరేయటం లాంటి చర్యలతో ప్రతిపక్ష సభ్యులు రచ్చ రచ్చ చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బిల్లును ఆమోదించే తొందరను ప్రదర్శించిన అధికారపక్షం సంప్రదాయాన్ని తోసిరాజన్నట్లుగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. తీవ్ర గందరగోళం నడుమ సభ వాయిదా పడి.. తిరిగి ప్రారంభమైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు చాలామందిని బాధించాయి. సభలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాల్ని నిలిపివేయటం కనిపించింది.

అన్నింటికి మించిన సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1.42 గంటల నుంచి 2 గంటల మధ్యలోని పద్దెనిమిది నిమిషాలు పెద్దల సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మార్షల్స్.. ఎంపీల నడుమ తోపులాట.. నినాదాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో బిల్లుపై ఓటింగ్ పెట్టిన డిప్యూటీ ఛైర్మన్.. సభ్యులు చేసిన సవరణల్ని మూజువాణి ఓటుతో తిరస్కరించటమే కాదు.. బిల్లుల్ని ఆమోదించినట్లుగా ప్రకటించారు.

దీంతో.. యుద్ధమే గెలిచినట్లుగా అధికారపక్ష సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా.. విపక్ష సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో సభలోనే బైఠాయించారు. తమ నిరసనను వ్యక్తం చేశారు. వీరి కారణంగా.. లోక్ సభ కార్యక్రమాల్ని గంట పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. కరోనా నేపథ్యంలో లోక్ సభ సభ్యులు రాజ్యసభలో కూర్చునేలా చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభలో నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. లోక్ సభ సభ్యులు సభలోకి రాలేక.. బయటే ఉండిపోయారు. మొత్తంగా వివాదాస్పద బిల్లులుగా అభివర్ణిస్తున్న ఈ రెండింటిని ఆమోదింపజేయటానికి అధికారపక్షం అనుసరించిన వైనం మాత్రం ఎప్పటికి అభ్యంతరకరమే అన్న మాట ప్రజాస్వామ్యవాదుల నోట వినిపిస్తోంది.