Begin typing your search above and press return to search.

పదమూడు రోజులు ఫాంహౌస్ లో ఏం జరిగింది కేసీఆర్?

By:  Tupaki Desk   |   1 Jan 2021 2:30 PM GMT
పదమూడు రోజులు ఫాంహౌస్ లో ఏం జరిగింది కేసీఆర్?
X
రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారికి చాలా కష్టం. ఎందుకంటే.. ఏళ్ల తరబడి తనదంటూ ఒక మార్కును కొనసాగిస్తున్న ఆయన.. ఉన్నట్లుండి మారిపోవటం అంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని చెప్పాలి. ఆరేళ్ల కేసీఆర్ పాలనకు.. గడిచిన వారంరోజులుగా కేసీఆర్ తీరును చూస్తే.. మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. వరాలు ఇచ్చే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని కేసీఆర్.. ఒక సందర్భంలో దాదాపు నెలకు పైనే రోజుకు.. రెండురోజులకు ఒక వరాన్నిప్రకటించేవారు.

దీంతో..ఆయన్ను వరాల దేవుడిగా అభివర్ణించేవారు. వరాల విషయంలో ఇంత దూకుడుగా వ్యవహరించే ఆయన.. పాలనాపరమైన అంశాల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఒక పట్టాన నిర్ణయాలు తీసుకోరన్న విమర్శ ఉంది. అలాంటి కేసీఆర్.. గడిచిన వారంలో విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు భారీగా ఉన్నాయని చెప్పాలి. అంతేకాదు.. తాను ఏదైనా స్టాండ్ తీసుకుంటే.. ఆ విషయంమీద అంత త్వరగా వెనక్కి త్గగని తత్త్వం గులాబీ బాస్ లో ఉంటుంది. అందుకు భిన్నంగా.. తన నిర్ణయాల్ని వెనక్కి తీసేసుకుంటూ వెళ్లిపోతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. రాజకీయవర్గాల్లోనూ పెద్ద చర్చకు తెర తీసిందని చెప్పాలి.

అయితే.. ఈ మార్పులన్నింటికి మూలం కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటనగా పలువురు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడటం.. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త బంద్ ను తెలంగాణ ప్రభుత్వం నేరుగా మద్దతు ఇవ్వటం.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. వెనక్కి వచ్చిన తర్వాత నుంచి మార్పు ఆయనలో చాలానే కనిపిస్తోంది.

ఈ విషయాన్ని అందరూ నోటీస్ చేసినా.. మరో ముఖ్యమైన అంశాన్ని చాలామంది పట్టించుకోలేదని చెప్పాలి. ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతిభవన్ కు వచ్చి.. ముఖ్య అధికారులతో భేటీకావటం..కీలక ఆదేశాలు జారీ చేసేసిన ఆయన.. గుట్టుచప్పుడు కాకుండా ప్రగతిభవన్ నుంచి ఫాంహౌస్ కు వెళ్లారు. తనకెంతో ఇష్టమైన ఫాంహౌస్ కు వెళ్లటంలో విశేషం ఏమీ లేదు. కానీ.. ఆయన వెళ్లిన తర్వాత మంత్రి కేటీఆర్ వెళ్లటం ఒక ఎత్తు అయితే.. ఈసారి ట్రిప్ లో ఏకంగా పదమూడు రోజుల వరకు అక్కడే ఉండటం.. హైదరాబాద్ ముఖం చూడకపోవటం మాత్రం ఆసక్తికరంగా మారింది.

ఆ పదమూడు రోజులు ఫాంహౌస్ లో కేసీఆర్ ఏం చేశారు? ఎవరిని కలిశారు? ఎవరెవరితో భేటీ అయ్యారు? లాంటివి కీలకంగా మారాయని అంటున్నారు. తాజా మార్పులన్నింటికి కారణం.. ఫాంహౌస్ లోని ఆ పదమూడు రోజుల కసరత్తేనని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఫాంహౌస్ లో ఏం జరిగందన్న విషయంపై వివరాలు బయటకు పొక్కనప్పటికీ.. కాస్త ఆలస్యంగా అయినా ఆ వివరాలు రాక మానదంటున్నారు.