Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలో చ‌తురులు.. చెమ‌క్కులు.. ఏం జ‌రిగింది..?

By:  Tupaki Desk   |   18 March 2023 1:02 PM GMT
ఏపీ అసెంబ్లీలో చ‌తురులు.. చెమ‌క్కులు.. ఏం జ‌రిగింది..?
X
ప్ర‌స్తుతం అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ స‌భా ప‌ర్వంలో నిత్యం.. అంటే.. ఇప్ప‌టికి 5 రోజులు పూర్త‌య్యాయి. ఈ ఐదు రోజుల్లోనూ.. టీడీపీ స‌భ్యులు స‌స్పెన్ష‌న్ల‌కు గురికావ‌డం లేదా.. కొంద‌రు వాకౌట్ చేయ‌డం తెలిసిందే. తొలిరోజు నుంచి ఐదో రోజు వ‌ర‌కు స‌భ్యులు స‌స్పెండ్ అయ్యారు. అయితే.. ఇక్క‌డ కొన్ని చ‌తురులు, చెమ‌క్కులు చోటు చేసుకున్నాయి. అవి పైకి క‌నిపించ‌క‌పోయినా.. స‌భ్యుల మ‌ధ్య న‌వ్వులు కురిపించాయి.

"తొంద‌ర‌గా ప‌దండి.. ఎలాగూ మీరు మ‌మ్మ‌ల్ని స‌స్పెండ్ చేస్తారు. వెయిటింగ్ ఎందుకు?".. టీడీపీ స‌భ్యుడు చేసిన కామెంట్ ఇది. అది కూడా వైసీపీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ముందే.. చేయ‌డం గ‌మ‌నార్హం. దీనికి గుడివాడ రిప్ల‌య్ ఏంటంటే.. "అన్నా.. మీరంటే మాకేమ‌న్నా..కోప‌మా? మీరు కూడా మా బాధ అర్థం చేసుకోవాలి. మాది పెనంపై నుంచి పొయ్యిలోకి ప‌డిన ప‌రిస్థితి" అన్నారు.

"కాదు త‌మ్ముడూ.. మాకు మైక్ ఎలానూ రాదు. మేం ఎంత మందిమి వ‌స్తున్నాం. మాకు తెలియ‌దా!" అని ఓ టీడీపీ నాయ‌కుడు చమ‌క్కులు విసిరారు. దీనికి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రియాక్ట్ అవుతూ.. "అన్నీ తెలిసే మీరు .. మేం చేస్తున్నాం.. మీ మీడియాకు తెలియ‌కుండా .. మేనేజ్ చేయండి" అని వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ, వైసీపీ స‌భ్యులు ఘొల్లున న‌వ్వేసుకున్నారు. వెంట‌నే స‌భ‌లోకి గంభీరంగా అడుగులు వేశారు.

క‌ట్ చేస్తే.. క్యాంటీన్ సీన్‌:

"అన్నా నీకు ఇష్ట‌మ‌ని.. ప‌చ్చి చేప‌ల పులుసు చేయించా. నీతో క‌లిసి తిని ఎన్నాళ్ల‌యిందో!" సీమ‌కు చెందిన ఓ సీనియ‌ర్ టీడీపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి.. అదే జిల్లాకు చెందిన ఓ వైసీపీ మంత్రి చేసిన వ్యాఖ్య‌. దీనికి ఆయ‌న బ‌దులిస్తూ.. "గురువారం తిన‌ను క‌ద‌న్నా!" అన్నారు. "అయితే.. ఏం కావాలో చెప్పు?! అని స‌ద‌రు మంత్రి ప్ర‌శ్నించే స‌రికి.. "కాకా ప‌డుతున్నావా.. ఏంటి?" అని ప‌క్క‌నే ఉన్న అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు. దీంతో మ‌రోసారి స‌భ్యుల మ‌ధ్య న‌వ్వులు విరిసాయి.

కొస‌మెరుపు: ఇదంతా కూడా మీడియా స‌భ్యులు గ‌మ‌నించారు. దీంతో వీరు సంయుక్తంగా ఒక ప్ర‌క‌ట‌న చేశారు. `మీరు ఇవేవీ రాయొద్దు. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. ఫ్రెండిషిప్‌.. ఇలానే ఉంటుంది. ఎంత సేపూ కొట్టుకోలేం క‌దా!" అని ఇరు ప‌క్షాల స‌భ్యులు ముక్తాయించారు. దీంతో మీడియా మిత్రులు కూడా న‌వ్వేసి ఊరుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.