Begin typing your search above and press return to search.

కిడారి హ‌త్య ముందు రోజు రాత్రి అలా జ‌రిగింద‌ట‌

By:  Tupaki Desk   |   4 Oct 2018 4:57 AM GMT
కిడారి హ‌త్య ముందు రోజు రాత్రి అలా జ‌రిగింద‌ట‌
X
అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు.. మాజీ ఎమ్మెల్యే సివేరి సోము హ‌త్య సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఉనికి కోసం కిందా మీదా ప‌డుతున్న మావోల‌కు తాజాగా విరుచుకుప‌డిన వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార‌ప‌క్షానికి వ‌ణుకు పుట్టించింద‌ని చెప్పాలి. ఈ కేసు విచార‌ణ చేస్తున్న పోలీసుల‌కు తాజాగా ఆస‌క్తిక‌ర విష‌యాల్ని సేక‌రించిన‌ట్లుగా తెలుస్తోంది.

మావోల క‌ద‌లిక‌ల మీద దృష్టి సారించి.. అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన పోలీసులు మామూళ్ల మ‌త్తులో ప‌డిపోయారే త‌ప్పించి.. ఇంకేం చేయ‌టం లేద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కిడారి హ‌త్య‌కు ముందు రోజు పోలీసులు నాటు కోడి విందును చేసుకున్న స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. పోలీసులు.. ఉన్న‌తాధికారులు మామూళ్ల మ‌త్తులో జోగుతూ.. గ్రామాల్లో తిర‌గ‌ట‌మే మానేశార‌న్నది తాజా విచార‌ణ‌లో తేట‌తెల్ల‌మైంది.

మైదాన ప్రాంతాల్లో ప‌ని చేసి ప‌నిష్ మెంట్ లో అర‌కు వ‌చ్చిన ఒక పోలీసు అధికారికి గిరిజ‌నులు ప్ర‌తి ఆదివారం త‌ప్ప‌నిస‌రిగా నాటుకోడి పంపాల్సిందేన‌ట‌. అంతేనా .. గిరిజ‌న ప్రాంతాల్లో రోగుల‌కు సేవ చేయాల్సిన పోలీసు అధికారి స్నేహితుడితో క‌లిసి కిడారి హ‌త్య ముందురోజు నాటుకోడి విందులో మునిగిపోయిన‌ట్లు చెబుతున్నారు.

ఇదో కోణ‌మైతే.. దాడి ముందు రోజు రాత్రి మావోలు సైతం విందులో తేలియాడిన‌ట్లుగా తెలుస్తోంది. ఎవ‌రికి అనుమానం రాకుండా ఉండ‌టం కోస‌మే ఈ ఏర్పాట్లుగా చెబుతున్నారు. దాడికి ప్లాన్ చేస్తున్న విష‌యాన్ని గుర్తించేలా కాకుండా.. సామాన్యుల మాదిరి వ్య‌వ‌హ‌రించ‌టం.. ఏదో మీటింగ్ కోసం వ‌చ్చిన‌ట్లే కానీ.. టార్గెట్ కోసం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌లేదంటున్నారు.

ఒడిశా నుంచి వ‌చ్చిన ద‌ళంలో ఎక్కువ మంది మ‌హిళ‌లు ఉండ‌టం.. కిడారి హ‌త్య‌కు ముందు రోజు రాత్రి జీలుగ‌క‌ల్లు తెప్పించుకోవ‌ట‌మే కాదు.. దూడ మాంసం కోసం ప్ర‌య‌త్నించినా దొర‌క‌లేద‌ని తేలింది. స్థానిక గిరిజ‌నుల పేరుతో ఎమ్మెల్యే బంధువుల‌కు.. స‌న్నిహితుల‌కు ఫోన్లు చేయించి.. గ్రామానికి ఎమ్మెల్యే సార్ ఎన్ని గంట‌ల‌కు వ‌స్తున్నార‌న్న స‌మాచారాన్ని సేక‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. కిడారి కారు డ్రైవ‌ర్ నెంబ‌ర్ల‌తో పాటు.. అనుచ‌రులు.. గ‌న్ మెన్ల నెంబ‌ర్ల‌ను కూడా మావోలు సేక‌రించిన తీరు చూస్తే.. ఎట్టి ప‌రిస్థితుల్లో టార్గెట్ మిస్ కాకూడ‌ద‌న్న ప్లానింగ్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.