Begin typing your search above and press return to search.

రిజిస్ట్రేషన్లపై హైకోర్టు వ్యాఖ్య తర్వాత ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   9 Dec 2020 4:13 AM GMT
రిజిస్ట్రేషన్లపై హైకోర్టు వ్యాఖ్య తర్వాత ఏం జరిగింది?
X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటం తెలిసిందే. వ్యవసాయ భూములు ఏ రీతిలో అయితే ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు చేస్తారో.. అదే రీతిలో వ్యవసాయేతర భూముల్ని కూడా ధరణిలో రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా ఆపేయటం తెలిసిందే. దీంతో.. ఆస్తుల అమ్మకాలు.. కొనుగోళ్లు ఆగిపోయాయి. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది రిజిస్ట్రేషన్లు ఆగిపోవటంతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది. అన్నింటికి మించి.. అడ్వాన్సులు చెల్లించి.. మంచిరోజున కొనుగోలు చేయాలనుకున్న వారికి షాకిస్తే.. ఆస్తుల అమ్మకాల ద్వారా.. ఆర్థిక అంశాల్ని సెటిల్ చేసుకోవాలనుకునే లక్షలాది మంది గడిచిన మూడు నెలలుగా అటూ ఇటూ కాని త్రిశంక స్వర్గంలో ఉండిపోయారు.

ఇదిలా ఉంటే.. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ఎంత వరకు భద్రతతో కూడుకుందన్న అనుమానంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం తెలంగాణ హైకోర్టులో దాఖలు కావటం.. దానిపై సాగిన విచారణలో భాగంగా స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి.. పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు ఆపమని తాము చెప్పలేదన్నారు. ధరణి పోర్టల్ ద్వారా కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు చేసే వరకు పాత పద్దతిలో చేసుకోవచచన్న మాట వచ్చింది.

హైకోర్టు చేసిన వ్యాఖ్య అనంతరం ప్రభుత్వ స్పందన ఏమిటన్న అంశంపై పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమైంది. అయితే.. అందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మంగళవారం రాత్రి బీఆర్కే భవన్ లో సీఎస్ సోమేశ్ కుమార్ అత్యున్నత అధికారులతో సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. పాత పద్దతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో.. తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లను పాత పద్దతిలో చేసి.. ఆ తర్వాత ధరణి పోర్టల్ లో నమోదు సాధ్యాసాధ్యాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 10న ఉండటం.. అందుకు మరో రోజు మాత్రమే వ్యవధి ఉండటంతో.. ఆ రోజు కోర్టు నిర్ణయం ఏమిటన్న దాన్ని చూడాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ నెల 10న హైకోర్టు ఏం చెబుతుందో చూసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదించాలని నిర్ణయించారు. మొత్తంగా రెండు.. మూడు రోజుల్లో పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేయాలా? వద్దా? అన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మూడు నెలలుగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణను తెర దించేలా సీఎం నిర్ణయం తీసుకుంటారా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.