Begin typing your search above and press return to search.

సజ్జనార్ చేసిందే చేయాలంటున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

By:  Tupaki Desk   |   28 Aug 2021 10:30 AM GMT
సజ్జనార్ చేసిందే చేయాలంటున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
X
ఒక ఉదంతం ఇప్పుడు కర్ణాటకలో పెను సంచలనంగా మారటమే కాదు.. తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. విపరీతమైన భావోద్వేగంతో ఉన్న కన్నడిగుల మూడ్ ను అర్థం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మైసూరు నగర శివారులో ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన రేపిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ దారుణ ఘటనను రాజకీయ పార్టీలన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఉదంతంపై కన్నడిగులంతా కోపంతో ఉన్నారు. పోలీసులు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నారు.

ఇంత ఆవేశాన్ని రగిలించిన ఈ దారున నేరానికి సంబంధించి ఇప్పటివరకు నిందితుల్ని పోలీసుల్ని పట్టుకోకపోవటంపై నిరసన మరింత పెరుగుతోంది. బాధితురాలి మీద అత్యాచారానికి పాల్పడిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రెండేళ్ల క్రితం హైదరాబాద్ మహానగర శివారులో జరిగిన దిశ ఘటనలో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన వైనాన్ని కుమారస్వామి ప్రస్తావించారు.

దిశ హత్యాచార కేసులో హైదరాబాద్ పోలీసులు వ్యవహరించినట్లే.. మైసూర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఉదంతంలోనూ దోషులపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పోలీసుల చర్యల్ని ఫాలో కావాలని.. ఇలాంటి నేరాల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోకుంటే పరిస్థితులు మెరుగుపడవని వ్యాఖ్యానించారు. కుమారస్వామి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మైసూర్ అత్యాచార కేసులో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని కోరిన ఆయన.. ఆ విషయంలో హైదరాబాద్ పోలీసుల చర్యల్ని అనుసరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా ప్రభుత్వం ఆపలేకపోతుందని విమర్శించారు. ప్రస్తుత వ్యవస్థ నేరాల్ని ప్రోత్సహించేలా ఉందన్న ఆయన.. నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి.. కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చేస్తున్నారన్నారు.

నేరాలు చేసినా తమకేం కాదన్న నమ్మకంతో వారు అలా చేస్తున్నారన్నారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. దిశ ఉదంతంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం.. నిందితులు ఎన్ కౌంటర్ కావటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సైబరాబాద్ సీపీ గా వ్యవహరించిన సజ్జనార్ నాయకత్వంలో జరగడం తెలిసిందే. సజ్జనార్ కన్నడిగ కావటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో ఐపీఎస్ గా ఏపీని ఎంచుకున్నారు. అప్పుడు సజ్జనార్ టీం చేసినట్లు ఇప్పుడు మైసూర్ పోలీసులు చేయాలని కుమారస్వామి కోరుకోవడం ఆసక్తికరంగా మారింది.