Begin typing your search above and press return to search.

దేశంలో పేదరికం తగ్గిందట.. వింటున్నారా..!

By:  Tupaki Desk   |   13 Dec 2022 6:30 AM GMT
దేశంలో పేదరికం తగ్గిందట.. వింటున్నారా..!
X
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయాయి. ఇటీవలే 75వ రిపబ్లిక్ డే వేడుకలను సైతం ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ పతకాలను ఎగురేవేసి భారతీయులంతా హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ 75 ఏళ్ల కాలంలో భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. శాంతికాముక దేశంగా ఉండే భారత్ గత కొన్నేళ్లలో ఆయుధ సంపత్తిలో మేటిగా నిలుస్తోంది. రక్షణ రంగంలో అద్వితీయమైన శక్తిగా ఎదిగింది. భారత్ జోలికి వచ్చే శత్రుమూకల వెన్నులో దడ పుట్టించే స్థాయికి చేరింది. ఆర్థిక పరంగా అగ్ర దేశాలకు గట్టి పోటీ ఇస్తోంది.

దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ ప్రస్తుతం ఎగుమతులు స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే భారత్ లో క్రమంగా పేదరికం తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. గత దశాబ్దంన్నర కాలంలో భారత్ లో 41 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందినట్లు యూఎన్డీపీ-2022లో వెల్లడైందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపీఐ) 2022 ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) నివేదికలను కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో చదివి విన్పించారు.

నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎంపీఐ 2021 నివేదిక ప్రకారంగా దేశంలోని జనాభాలో 25 శాతం మంది పేదరికాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆక్స్ ఫర్డ్ పాపర్టీ అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ ఇనిషియేటివ్.. యూన్డీపీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో 2005-06 నుంచి 2019-21 మధ్య కాలంలో భారత్ లో 41.5కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని తెలిపారు.

2019-21 రెండేళ్ల కాలంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా ఎంపీఐ ఈ నివేదికలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.75 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 8.81శాతంగా ఉందని నివేదించింది. పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీములు అమలు చేస్తోందని దీని ఫలితంగానే పేదరికం తగ్గుముఖం పట్టిందని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు.

అయితే కరోనా కాలంలో కోట్లాది మంది వలస కార్మికులు.. ఉద్యోగస్తులు రోడ్డున పడిన నేపథ్యంలోనే దేశంలో పేదరికం తగ్గిందని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటుండటం విచిత్రంగా ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సంస్థలు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకొని భారత్ లో పేదరికంపై అంచనాకు వచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా భారత్ పేదరికం నుంచి క్రమంగా బయటపడుతుందని సర్వేలు చెబుతుండటం ఒకింత సంతోషాన్ని కలిగిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.