Begin typing your search above and press return to search.

జగన్ వాట్ టు డు..వాట్ నాట్ టు డూ?

By:  Tupaki Desk   |   6 Dec 2021 2:30 PM GMT
జగన్ వాట్ టు డు..వాట్ నాట్ టు డూ?
X
ప్రజలు ఒక పార్టీని గెలిపించారు అంటే ఎన్నో విషయాలను చూసి ఓట్లు వేస్తారు. భారతదేశంలో ఓటర్ల నిర్ణయాత్మక శక్తిని ఎపుడూ తక్కువ చేసి చూడకూడదు, నిరక్షరాస్యులు అయినా సరే ఓటు వేసే ముందు చాలా అంశాలను చూస్తారు.

అలా వైసీపీని 2019 ఎన్నికల్లో ప్రజలు గెలిపించారు. జగన్ కి పాలనానుభవం లేదు అన్నది అందరికీ తెలుసు. అయితేనేమి తన తండ్రి వైఎస్సార్ మాదిరిగా జగన్ పాలిస్తారు అన్న ఆశతోనే జనాలు ఆయనకు ఏకపక్ష విజయాన్ని అందించారు.

అంతే కాదు, వైసీపీకి 151 సీట్లు, అలాగే సర్పంచులు, ఎంపీపీలు, కార్పోరేషన్లు, జెడ్పీటీసీలు, మునిసిపాలిటీలు ఇలా అన్ని చోట్లా ఓటెత్తి మరీ వైసీపీకి బ్రహ్మరధం పట్టారు. అలాంటిది వైసీపీ పాలన ఎలా చేయాలి, జనాలకు ఏ విధంగా మేలు చేయాలి అన్నది విశ్లేషించుకుంటే నిరాశ మాత్రమే మిగులుతుంది.

అందుకే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జగన్ కి నిజానికి పాలనానుభవం లేదు, తన సొంత నిర్ణయాలతోనే పాలన సాగిస్తున్నారు అని మేధావులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ కి ఒక్కసారి చాన్స్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. దాని ఫలితమే అద్భుతమైన తీర్పు వచ్చింది. సరే రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఇంతకీ ఏపీలో పాలన ఎలా సాగుతోంది అంటే అన్నీ జగన్ ఏకపక్ష నిర్ణయాలే అని చెప్పాల్సి ఉంటుంది.

జగన్ కేవలం నవరత్నాలనే పట్టుకుని కూర్చుకున్నారు. పూర్తిగా సంక్షేమం మీదనే ఆధారపడి ఆయన పాలన సాగిస్తున్నారు అని అంటున్నారు. ఏపీకి ఎలాంటి పెట్టుబడులు రావడంలేదు, దాంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎన్నో వస్తున్నాయి. అదే సమయంలో ఆదాయం చాలకపొవడంతో ప్రజల మీద పెను భారాలు వేస్తున్నారు అన్న మాట కూడా ఉంది.

ఈ సమయంలో ఒక సమస్య కాదు, వరసబెట్టి అనేక సమస్యలు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి. చివరికి ఉద్యోగులు సైతం ఆందోళనలను నిర్వహిస్తున్నారు. మరి జగన్ కానీ వైసీపీ కానీ ఈ కీలక సమయంలో ఏం చేయాలి అంటే ప్రజల దగ్గరకు నేరుగా వెళ్లాలి అన్న సూచనలు వస్తున్నాయి. ప్రజల సమస్యలను తెలుసుకోవాలి వాటిని పరిష్కరించేందుకు ఆర్ధిక నిపుణులతో కూర్చుని సమీక్షలు చేపట్టాలి. అలాగే అనుభవం కలిగిన మాజీ మంత్రులతో కమిటీ వేసి ఏపీ సమస్యల మీద అధ్యయనం చేయాలి. వాటి పరిష్కారానికి కూడా దారులు వెతకాలి అంటున్నారు.

అయితే వైసీపీ చేస్తున్నది ఏంటి అంటే కేవలం వాలంటీర్ల వ్యవస్థ మీదనే ఆధారపడుతోంది అన్న విమర్శలు ఉన్నాయి. జగన్ సైతం వాలంటీర్ల వ్యవస్థ బేషుగ్గా ఉందని నమ్ముతున్నారు. అయితే ఈ వ్యవస్థను మాత్రమే జగన్ నమ్మితే సరిపోదు అంటున్నారు. ప్రజా ప్రతినిధులను కూడా విశ్వాసంలోకి తీసుకుని వారి అభిప్రాయాలను అడగాలి. వారి నుంచి కూడా ప్రజా సమస్యల మీద వివరాలు సేకరించాలి. కానీ జరుగుతున్నది మాత్రం వేరుగా ఉందనే అంటున్నారు.

ఏపీలో ఎమ్మెల్యేల దారి వారిదైపోయింది. వాలంటీర్లతోనే కధ అంతా ప్రభుత్వం నడిపించడంతో వారు ఉత్సవ విగ్రహాలు అయిపోయారు. అదే సమయంలో అయిదేళ్ల పాటు ప్రజలు ఎన్నుకుని గెలిపించిన వారికి ఫలానా పని చేశామని చెప్పుకోవడానికి లేకుండా పోయిందన్న బాధ కూడా ఉంది. మరో వైపు ఎంపీలకు ఎమెల్యేలకు కూడా సరైన సంబంధాలు లేవు. పార్టీ పరంగా వారిని కరెక్ట్ చేసే వారు కనిపించడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి.

ఇక ఏపీలో సర్వం జగన్నాధం అన్నట్లుగా ఎంతసేపూ నవరత్నాలతోనే పాలన బ్రహ్మాండం అని మురిసిపోతున్నారే తప్ప విభజన ఏపీలో ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టే పరిస్థితి ఎక్కడా కనిపించడంలేదు అంటున్నారు. ఇక ఏపీలో ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యమానికి సిధ్ధమపడుతున్నారు. వారు గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలక భాగమైన ఉద్యోగులు పోరాటానికి సిద్ధపడడం అంటే అది ఇబ్బందికరమే అవుతుంది.

తమకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు సరికదా జీతాలు కూడా సకాలంలో ఇవ్వడంలేదని వారు చెప్పడం నిజంగా పాలనా వైఫల్యంగానే చూడాలి. అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది అన్నది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆదాయానికి మించి అప్పులు చేయడం, వాటికి సంక్షేమ పధకాల రూపంలో పంచడమే పాలనగా భావించడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైంది అంటున్నారు. దీంతో అర్దిక సమతూకం పూర్తిగా గాడి తప్పింది అన్న మాట కూడా మేధావుల నుంచి వస్తోంది.

సగం పాలన గడచింది, మిగిలిన సగం ఏలుబడిలో అయినా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. ఏపీలో ఉన్న అనేక కీలక మైన సమస్యల మీద దృష్టి పెట్టాలి. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వ పెద్దలు అడుగులు వేయాలి. ఎటువంటి భేషజాలకూ పోకుండా అనుభవం కలిగిన వారితో సంప్రదింపులు చేపట్టాలి. పాలన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న దాని మీద సొంత పార్టీకి చెందిన నిపుణులు, మేధావులతో చర్చించి ఏపీ దశ దిశను మార్చే విధంగా వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా అడుగులు ముందుకు వేయాలి. లేకపోతే మరిన్ని కొత్త సమస్యలతో ప్రభుత్వం నిండా మునుగుతుందన్న ఆందోళన అయితే సర్వత్రా ఉంది మరి.